Begin typing your search above and press return to search.

డ్యాన్సింగ్ అంకుల్ జోరు పెరిగిపోతోంది!

By:  Tupaki Desk   |   7 Jun 2018 7:26 AM GMT
డ్యాన్సింగ్ అంకుల్ జోరు పెరిగిపోతోంది!
X
డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఎప్పుడు ఎవ‌రు ప్ర‌ముఖులైపోతారో ఒక ప‌ట్టాన ఊహించ‌టం క‌ష్టం. రోటీన్ కు భిన్నంగా ఉంటే చాలు.. సామాన్యుడు సైతం రాత్రికి రాత్రి సెల‌బ్రిటీ అయ్యే అవ‌కాశం ఇప్పుడు న‌డుస్తున్న డిజిటల్‌.. సోష‌ల్ మీడియాతో సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

మొన్న‌టి వ‌ర‌కూ ప‌రిమిత ప్ర‌పంచంలో బ‌తికేసిన డ్యాన్సింగ్ అంకుల్ సంజ‌య్ శ్రీ‌వాస్త‌వ్‌.. హ‌టాత్తుగా ఒక పెళ్లి వేడుక‌ల్లో వేసిన డ్యాన్స్ పుణ్య‌మా అని లైమ్ లైట్‌ లోకి వ‌చ్చారు. అంకుల్ వేసిన డ్యాన్స్ ను వీడియో క్లిప్ గా మార్చి.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం.. అది కాస్తా వైర‌ల్ గా మార‌టంతో ఒక్క‌సారిగా సెల‌బ్రిటీ స్టేట‌స్ వ‌చ్చేసింది.

దీనికి కొన‌సాగింపుగా.. ఆయ‌న వేసిన నృత్యం సామాన్యుల‌కే కాదు.. బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు న‌చ్చేసింది. ఎంత‌లా అంటే బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి అయితే.. ఏకంగా డ్యాన్సింగ్ అంకుల్‌ కు సినిమా ఛాన్స్ ఇస్తాన‌ని మాట ఇచ్చేశారు. దీనికి అద‌నంగా సంజ‌య్ కు ప్ర‌ముఖ కంపెనీ బ‌జాజ్ అల‌య‌న్స్ ఒక ప్ర‌క‌ట‌న‌లో న‌టించే అవ‌కాశాన్ని ఇచ్చింది.

త‌న‌కు ల‌భించిన ఛాన్స్ తో చెల‌రేగిపోతున్నారు సంజ‌య్. బ‌జాజ్ ప్ర‌క‌ట‌న‌లో ఒక జింగిల్ కు ఆయ‌న వేసిన డ్యాన్స్ కు అంతా ఫిదా అయ్యేలా ఉంది. తాను న‌టించిన జింగిల్ ను ఈ డ్యాన్సింగ్ అంకుల్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ జింగిల్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.