Begin typing your search above and press return to search.

క‌ర్నూలు దాటొద్దు... ష‌ర‌తుల‌తో భూమా అఖిల ప్రియ‌కు బెయిల్‌

By:  Tupaki Desk   |   24 May 2023 6:28 PM GMT
క‌ర్నూలు దాటొద్దు... ష‌ర‌తుల‌తో భూమా అఖిల ప్రియ‌కు బెయిల్‌
X
టీడీపీ నాయ‌కురాలు, క‌ర్నూలు పొలిటిక‌ల్ సింగం భూమా అఖిల ప్రియ‌కు బెయిల్ ల‌భించింది. అదే పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో అరెస్టై, కర్నూలు మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భూమా అఖిల ప్రియకు నంద్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

దీంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు.టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ నెల 16వ తేదీన కొత్తపల్లి వద్ద భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య దాడి జరిగిన విషయం తెలిసిందే.

ఆ దాడిలో ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ అనుచరులు దాడి చేశారు. దీంతో ఈ నెల 17వ తేదీన అఖిల ప్రియ దంపతులను ఆళ్లగడ్డలో పోలీసులు అరెస్టు చేసి, నంద్యాల కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14 రోజులపాటు న్యాయస్థానం రిమాండ్ విధిం చింది.

ఈ నేపథ్యంలో భూమా అఖిల ప్రియకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయగా.. మరోసారి మళ్లీ కర్నూలు జిల్లా కోర్టులో న్యాయవాదులు పిటిషన్ వేశారు.

పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పోలీసులు సైతం భూమా అఖిల ప్రియను కస్టడీ తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేశారు.

కానీ, ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో భూమా అఖిల ప్రియకు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. అయితే, ఆమె భ‌ర్త మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. ఈయ‌న‌కు సంబందించి బెయిల్ పిటిష‌న్‌ను మాత్రం విచారించాల్సి ఉంది. ఇదిలావుంటే.. భూమా అఖిల ప్రియ క‌ర్నూలు జిల్లాను వీడేందుకు వీల్లేద‌ని.. ఎలాంటి స‌భ‌లు స‌మావేశాలు నిర్వ‌హించ‌రాద‌ని కోర్టు ష‌ర‌తులు పెట్టింది. అదేవిధంగా ఎవ‌రినీ రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేయ‌రాద‌ని తేల్చి చెప్పింది.

అసలు ఏం జరిగిదంటే..మే 16వ తేదీ రాత్రి నంద్యాల మండలం, కొత్తపల్లి దగ్గర యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దీంతో 17వ తేదీన కొత్తపల్లి వద్ద టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో భూమా అఖిల ప్రియ అనుచరులు, ఏవీ సుబ్బారెడ్డి అనుచరులు దాడులు చేసుకున్నారు. ఆ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి గాయాలు కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అఖిల ప్రియ దంపతులను ఆళ్లగడ్డలో పోలీసులు అరెస్టు చేసి, నంద్యాల కోర్టులో హాజరుపర్చారు.