Begin typing your search above and press return to search.

ముంబైకి దొరికాడో.. 'జూనియర్ డివిలియర్స్'

By:  Tupaki Desk   |   13 Feb 2022 10:30 AM GMT
ముంబైకి దొరికాడో.. జూనియర్ డివిలియర్స్
X
అతడి ఆట కళాత్మకం.. అందులోనూ విధ్వంసం.. 65 104 96 97 6 138 ఇవీ.. అతడు ప్రపంచ కప్ లో చేసిన స్కోర్లు.. ఈ పరుగులు కూడా భారత్, ఉగాండా, ఐర్లాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ పై చేసినవి. ఇందులో రెండు తప్ప మిగతావన్నీ పెద్ద జట్లే. అంచనాలు భారీగా రేపుతూ పరుగుల ప్రవాహంతో చెలరేగిపోతున్న అతడు దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్ మన్ డివాల్డ్ బ్రీవిస్. ఇటీవలి అండర్ 19 ప్రపంచ కప్ లో అందరినీ ఆకర్షించిన ఆటగాడు బ్రేవిస్.

ఇప్పటికే అతడిని భవిష్యత్ డివిలియర్స్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీనికితగ్గట్లే ఐపీఎల్ తాజా వేలంలో బ్రీవిస్ భారీ ధర పలికాడు. అతడి కోసం రెండు చాంపియన్ జట్లు ముంబై, చెన్సై పోటీ పడగా, చివరకు ముంబై కైవసం చేసుకుంది. కనీస ధరకు 15 రెట్లు ఎక్కువ పలికాడు.

ముంబై గూటికి బేబీ డివిలియర్స్‌
ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో శనివారం పలువురు భారత కుర్రాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారు. మొత్తం పది ఫ్రాంఛైజీలు నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఈ క్రమంలోనే ఎప్పుడూ యువ టాలెంట్‌ను వెలికితీసే ముంబయి ఇండియన్స్‌ ఈసారి కూడా అదే పంథాను అనుసరించింది. బేబీ ఏబీ డివిలియర్స్‌గా పేరుగాంచిన దక్షిణాఫ్రికా యువ బ్యాటర్‌ డివాల్డ్‌ బ్రీవిస్‌ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.

అతడీ వేలంలో కనీస ధర రూ.20 లక్షలతో అడుగుపెట్టగా ముంబయి భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైంది. అందుకు కారణం ఇటీవల జరిగిన అండర్‌-19 ప్రపంచకప్పే. అక్కడ ఈ యువ బ్యాట్స్‌మన్‌ 506 పరుగులు చేశాడు. టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో 18 ఏళ్ల నాటి శిఖర్‌ ధావన్‌ రికార్డును బద్దలుకొట్టాడు. 2004లో అంబటి రాయుడు కెప్టెన్సీలో ధావన్‌ 505 పరుగులు చేసి అప్పట్లో సంచలనం సృష్టించాడు.

ఇప్పుడు దాన్నే బేబీ డివిలియర్స్‌ అధిగమించాడు. మరోవైపు మెగా వేలంలో ఈ యువ ప్రతిభావంతుడిని తీసుకొనేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సైతం ఆసక్తి చూపింది. చివరికి ముంబయి సొంతం చేసుకుంది.

ఆర్సీబీ అంటే ఇష్టం..

బ్రేవీస్ ను బేబీ డివిలియర్స్‌గా ఎందుకు పిలుస్తారంటే.. అతడు అచ్చం దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ తలపించేలా బ్యాటింగ్‌ చేస్తాడు. దీంతో అతడికి ఆ పేరు వచ్చింది. అలాగే అతడికి ఐపీఎల్‌లో డివిలియర్స్‌ ఆడిన ఆర్సీబీ జట్టంటే చాలా ఇష్టం. ఆ జట్టులో ఆడాలనే కోరిక ఉందని ఇటీవల ప్రపంచకప్‌ సమయంలో వెల్లడించడం గమనార్హం. చిత్రంగా, డివిలియర్స్ సేవలను కోల్పోయిన ఆర్సీబీ జూనియర్ డివిలియర్స్ ను దక్కించుకుని ఉంటే కొంత ఊరట దక్కేది. అయితే, వారికి డుప్లెసిస్ రూపంలో మరో కీలక ఆటగాడు దక్కాడు.