Begin typing your search above and press return to search.

ఎన్డీయేలోకి బాబు...జగన్...?

By:  Tupaki Desk   |   4 Jun 2023 6:00 AM GMT
ఎన్డీయేలోకి బాబు...జగన్...?
X
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అలాగే ఏపీలో రాజకీయ ప్రత్యర్ధులుగా ఉంటీ భీకర సంగ్రామం చేసుకుంటున్న వైసీపీ టీడీపీ కేంద్రంలోని ఎన్డీయే లో ఉండడం అంటే కుదిరేది కాదు. కానీ రెండు పార్టీలు ఆఫర్ ఇచ్చేస్తున్నాయి. ఒక విధంగా బీజేపీ హై కమాండ్ ని కంఫ్యూజ్ చేస్తూ ఫుల్ హ్యాపీని కూడా ఇచ్చేస్తున్నాయి. ఇంతకీ కమలనాధులకు ఇంతటి బంపర్ ఆఫర్ ఇస్తున్న ఏపీలోని రెండు బలమైన ప్రాంతీయ పార్టీల విషయంలో బీజేపీ ఆలోచన ఎలా ఉంది. వ్యూహాలలో చాణక్యుడినే మైమరపించే మోడీ అమిత్ షా ఏపీ రాజకీయాలను ఎలా మలుపు తిప్పబోతారు అన్నదే వెరీ ఇంటరెస్టింగ్ పాయింట్.

ఇదిలా ఉంటే ప్రస్తుతానికి చూస్తే ఏపీలో ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేలో లేవు. వైసీపీ అయితే తెర వెనక దోస్తీ చేస్తోంది అన్న ప్రచారం ఉంది. టీడీపీ బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ప్రేమను చూపిస్తోంది. అలా ఈ రెండు పార్టీలు బీజేపీతో చెలిమి కోసం పోటా పోటీగా నిలిచి ఉన్నాయి.

ఇక బీజేపీకి ఇంతటి సువర్ణ అవకాశం కానీ అదిరిపోయే చాన్స్ కానీ దేశంలో వేరే ఏ రాష్ట్రంలోనూ లేదంటే లేదు. ఇక నాలుగేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీతో దోస్తీ చేస్తూ రాజ్యసభలో వారికి తగిన మద్దతు ఇస్తూ జగన్ ఉన్నారని అంతా అంటారు. చంద్రబాబు కూడా బీజేపీ పెట్టే బిల్లులకు తన పరిమితమైన ఎంపీలతోనే మద్దతు ఇస్తూ వచ్చారు.

ఈ విధంగా చూస్తే రెండు పార్టీల నుంచి బీజేపీకి మద్దతు చాలా అనాయాసంగా దక్కుతోంది. బీజేపీ కూడా ఇదే బాగుంది అనుకుంటోని. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలోనూ వైసీపీ టీడీపీ బీజేపీ పెట్టిన క్యాండిడేట్ కే మద్దతు ఇచ్చాయి. అలా బీజేపీ కళ్ళలో ఆనందం చూడడం కోసం ఎందాకైనా అన్నట్లుగా వ్యవహరించాయి.

ఇపుడు ముందస్తు ఎన్నికలు ఏపీలో వస్తాయన్న ప్రచారం నేపధ్యంలో చంద్రబాబు బీజేపీతో పొత్తుకుని అఫీషియల్ గా ఖరారు చేసుకుంటారు అని వార్తలు వస్తున్నాయి. ఆయన పట్ల బీజేపీ పెద్దలు మునుపటిలా లేరు కాబట్టి బాబుకు వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అంటున్నారు. బీజేపీ కనుక టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉంటే మాత్రం ఎన్డీయేలో ఈ రోజు నుంచే టీడీపీ మెంబర్ అయిపోతుంది. అదే టైం లో వైసీపీ వెంటనే పక్కకు జరుగుతుందా అంటే అది చెప్పలేం.

వైసీపీ కూడా ఏపీ రాజకీయాల దృష్ట్యా బీజేపీతో మరీ ముఖ్యంగా కేంద్ర నాయకత్వం తో దోస్తీ చేస్తూనే ఉంటుంది అని అంటున్నారు ఇక గత నెల చివరిలో ఢిల్లీ వెళ్ళి వచ్చిన జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి కీలకమైన చర్చలు జరిపారు అని అంటున్నారు. బీజేపీకి వైసీపీ ఫుల్ సపోర్ట్ అన్నదే వైసీపీ అధినాయకత్వం పదే పదే చెబుతోంది అంటున్నారు.

ఇక 2024 ఎన్నికల తరువాత మరోసారి బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అంచనా కడుతున్న వైసీపీ సీట్లు అయితే బీజేపీకి తగ్గుతాయని కూడా లెక్కలు వేస్తోంది. అలాంటి సమయంలో సరైన షరతులు పెడుతూ ఏపీ ప్రయోజనాల పేరిట ఎన్డీయేలో చేరడానికి రెడీ అవుతుందని అంటున్నారు. అంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాతనే కేంద్రంలో వైసీపీ చేరుతుంది తప్ప ఎన్నికల ముందు మాత్రం బీజేపీని దూరంగానే పెడుతున్నట్లుగా వ్యవహరిస్తుంది అని అంటున్నారు.

దానికి కారణం వైసీపీకి మైనారిటీ ఓటు బ్యాంక్ గట్టిగా ఉంది. బీజేపీతో పొత్తు అని చెబితే ఆ ఓట్లు పోతాయి. అతి పెద్ద గండి పడి అది ఎన్నికల్లో గెలుపునే ప్రశ్నార్ధం చేస్తుంది అన్న భయాలు ఉన్నాయని అంటున్నారు. సో బీజేపీ పెద్దలకు వైసీపీ నుంచి ఆ హామీ అయితే ఉంది అని ప్రచారం సాగుతోంది. అంటే ఎన్నికల తరువాత వైసీపీ తమ ఎంపీలతో కలసి ఎన్డీయేలోకి చేరేందుకు సుముఖం అన్న వార్తలు అయితే ప్రచారంలో ఉంటున్నాయి.

అదే చంద్రబాబు అయితే ఎన్నికల్లో పొత్తులకు రెడీ అవుతున్నారు. పైగా దాన్ని బాహాటం చేస్తున్నారు. ఇక ఏపీలో మొత్తం పాతిక ఎంపీ సీట్లు ఉంటే అందులో మెజారిటీ అంటే 13 ఎంపీ సీట్లు అయినా బీజేపీకి ఇచ్చేందుకు బాబు ప్రతిపాదిస్తున్నారు అని అంటున్నారు. అంటే బాబు ప్రతిపాదనలు ఆఫర్లు బంపర్ గా ఉన్నాయని తెలుగుదేశం వర్గాలు అనుకూల మీడియా ఊదరగొడుతోంది.

మరి బీజేపీకి కేంద్రానికి పెద్దగా ఉన్న అమిత్ షా కానీ దేశాన్ని ఏలే మోడీ కానీ వైసీపీ టీడీపీలలో దేనికి ఓటు వేస్తారు అన్నదే ఇపుడు కీలకంగా మారుతోంది. నిజానికి బీజేపీకి సొంతంగా తన ఎంపీలను గెలిపించుకోవాలని ఉంది. అలా కనుక బీజేపీ ఆశిస్తే మాత్రం టీడీపీ ఇస్తున్న మెజారిటీ ఎంపీల ఆఫర్ కి మొగ్గవచ్చు అంటున్నారు. అలా కాకుండా తాను న్యూట్రల్ గా ఉంటే ఎటూ రెండు పార్టీల మద్దతు తనకే దక్కుతుంది అనుకుంటే వేరే పాలిటిక్స్ కి తెర తీసే చాన్స్ ఉంది అంటున్నారు.