Begin typing your search above and press return to search.

రఘురామకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన బాబు..?

By:  Tupaki Desk   |   3 Jun 2023 10:44 PM GMT
రఘురామకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన బాబు..?
X
చంద్రబాబు ఢిల్లీ టూర్ కి రాక రాక వస్తే ఆయన సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు రాలేదు. అదే సమయంలో అనూహ్యంగా వైసీపీ నుంచి గెలిచిన రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మరో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలసి బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కొంతసేపు రఘురామ అనేక అంశాల మీద చర్చించారని అంటున్నారు.

తనకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఉందని, నర్సాపురం ఇచ్చినా లేక వేరే పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇచ్చినా ఓకే అంటూ రఘురామ బాబు ముందు ఒక ప్రతిపాదన పెట్టి అభ్యర్ధించారని అంటున్నారు.

దానికి బాబు కూడా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కలసికట్టుగా పోటీ చేస్తాయని ప్రచారం అయితే ఉంది. బాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కావడంతో అది నిజం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

దాంతోనే రఘురామ మూడు పార్టీలు కలసి వస్తే వచ్చే ఎన్నికల్లో విజయం తధ్యమని భావించి తన సీటు కోసం బాబు వద్ద రిక్వెస్ట్ చేశారని అంటున్నారు చంద్రబాబు సైతం సానుకూలంగానే రియాక్ట్ అయ్యారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే రఘురామ సొంత సీటు నర్సాపురం ఈసారి పొత్తులలో భాగంగా బీజేపీకి అయినా లేదా జనసేనకు అయినా పోతుందని అంటున్నారు.

దాంతో ఆయన రాజమండ్రీ నుంచి అయినా పోటీకి రెడీ అని చెబుతున్నారు. మరి రాజమండ్రీలో చూస్తే ఆయనకు ఎంత వరకూ పట్టు ఉందని తెలియదు కానీ టీడీపీ మాత్రం స్టాంగ్ గానే ఉంది. పైగా బీజేపీకి జనసేనకు ఓట్లు ఉంటాయి. రాజులకు కూడా గతంలో గెలిచిన చరిత్ర ఉంది దాంతో రఘురామ సేఫ్ జోన్ గా రాజమండ్రి మీద కన్నేశారు అని అంటున్నారు.

అయితే ఇదే సీటు మీద లోకల్ గా ఉన్న నేతలు కూడా ఫోకస్ పెట్టారు. అయితే చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఆయన రఘురామకు రాజమండ్రి టికెట్ కేటాయించి మొత్తం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వనరుల భారాన్ని ఆయనకు అప్పగించవచ్చు అని అంటున్నారు.

కాగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటే ఆ పార్టీ రాజమండ్రి సీటుని కూడా అడిగే చాన్స్ ఉందని అంటున్నారు ఎందుకంటే ఆ పార్టీ తరఫున రెండు సార్లు ఇదే సీటు నుంచి ఎంపీలు గతంలో గెలిచారు. మరి రఘురామకు చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ సీటు ఏది అన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేరనే అంటున్నారు. మరో విషయం ఏంటి అంటే కాకినాడ ఎంపీ సీటు కూడా రఘురామకు కేటాయించే చాన్స్ ఉందని. చూడాలి మరి రెబెల్ ఎంపీ నాలుగేళ్ళ జగన్ మీద చేసిన పోరాటానికి చంద్రబాబు ఏ విధంగా బహుమతి ఇస్తారు అన్నది.