Begin typing your search above and press return to search.

ఆజాద్ నాకు నిజమైన స్నేహితుడు ... ప్రధాని మోదీ కంటతడి !

By:  Tupaki Desk   |   9 Feb 2021 6:31 AM GMT
ఆజాద్ నాకు నిజమైన స్నేహితుడు ... ప్రధాని మోదీ కంటతడి !
X
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటతడి పెట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ సమయంలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కంటతడి పెట్టారు. ఆజాద్ ను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోదీ. అధికారంలో ఉన్నా లేకున్నా ఆజాద్ ఒకేలా ఉన్నారని మోదీ చెప్పారు.

తరతరాలకు ఆజాద్ స్ఫూర్తి దాయకం అన్నారు. ఆజాద్ తనకు మంచి మిత్రుడని మోదీ చెప్పారు. ఆజాద్ సేవలను కొనియాడిన ప్రధాని మోదీ, దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు. తన ప్రసంగం సందర్భంగా ఆజాద్ కు ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు. రాజకీయాల్లో మచ్చ లేని నేత అంటూ ఆజాద్ ని కీర్తించారు. కాగా, ఏప్రిల్ లో రాజ్యసభ సభ్యుడు ఆజాద్ పదవీ కాలం ముగియనుంది.

గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘‘గుజరాతీ పర్యాటకులపై కశ్మీర్ లో ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడు ఆజాద్ నాకు ఫోన్ చేశారు. బాధపడుతూ ఏడ్చేశారు. నేరుగా విమానాశ్రయానికే వచ్చేశారు. ఓ కుటుంబ సభ్యుడిగా వారందర్నీ చూసుకున్నారు. బాధితులపై శ్రద్ధ చూపారు. ఆ సమయంలో ప్రణబ్ దాదా రక్షణ మంత్రిగా ఉన్నారు. మృత దేహాన్ని తరలించడానికి ఓ ఏయిర్ ఫోర్స్ విమానం కావాలని అడిగా. ఏదో ఒకటి కచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆజాద్ వల్ల దేశానికి చాలా లాభం జరిగింది. ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు. దేశం కోసం వారిచ్చే సూచనలు, సలహాలను ఎప్పటికీ స్వాగతిస్తూనే ఉంటాం.’’ అంటూ ఆజాద్‌కు మోదీ సెల్యూట్ చేశారు.