Begin typing your search above and press return to search.

ఎంత కోపమైతే మాత్రం.. అంతలా నోరు పారేసుకుంటే ఎలా అయ్యన్న!

By:  Tupaki Desk   |   25 Oct 2020 4:50 AM GMT
ఎంత కోపమైతే మాత్రం.. అంతలా నోరు పారేసుకుంటే ఎలా అయ్యన్న!
X
మాజీ మంత్రి కమ్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడికి కోపం వచ్చింది. రాజకీయాలు.. రాజకీయ నాయకులు అన్నతర్వాత కోపాలు సహజం. నరాలు తెగేంత కోపం వచ్చినప్పుడు ఎంత కూల్ గా స్పందిస్తారు అన్న దాని పైనే సదరు నేత భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఏపీ తెలుగు తమ్ముళ్లు ఈ మధ్యన బ్యాలెన్సు మిస్ అవుతున్నారు.

అధికారాన్ని చేజార్చుకున్న ఫస్ట్రేషన్ లో ఉన్న టీడీపీ నేతలు అవసరానికి మించి మాట్లాడటం.. మోతాదుకు మించిన వ్యాఖ్యలు చేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాజాగా అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు ఇదే రీతిలో ఉండటం గమనార్హం. గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని నిర్మాణాలు కట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పలు నిర్మాణాల్ని కూలగొట్టారు. దీనిపై గీతం వర్సిటీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇలా ఎలా చేస్తారంటూ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు.

నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాల్ని కూల్చివేయటంపై గీతం వర్సిటీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గీతం నిర్మాణాల్ని కూల్చివేతపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులపై బూతుపురాణాల్ని షురూ చేశారు. గాడిద కొడుకులు మొదలుకొని రాయలేని ఎన్నో వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వచ్చాయి.

ఆర్డీవో మొదలుకొని పలువురు అధికారుల్ని తీరును ఆయన తప్పు పట్టటాన్ని ఏమీ అనలేం. కానీ.. అందుకు భిన్నంగా తీవ్ర పదజాలంతో మాట తూలటం కచ్ఛితంగా తప్పే అవుతుంది. మరో టీడీపీ నేత కమ్ మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి మాట్లాడుతూ.. గీతం కాలేజ్ పై కక్ష సాధింపు చర్యల్ని మానుకోవాలన్నారు. విమర్శలు చేయటం తప్పు కాదు. నిజానికి ప్రజాస్వామ్య భారతంలో అవన్నీ సహజం. కాకుంటే.. నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలే తప్పించి.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే తిప్పలు తప్పవన్న వాస్తవాన్ని అయ్యన్న లాంటి సీనియర్ నేత గుర్తిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.