Begin typing your search above and press return to search.

మంత్రిగారి ఆంతర్యం : వైసీపీలో నిరుత్సాహం నిజమేనట...?

By:  Tupaki Desk   |   29 Jun 2022 8:30 AM GMT
మంత్రిగారి ఆంతర్యం : వైసీపీలో నిరుత్సాహం నిజమేనట...?
X
వైసీపీలో నిరుత్సాహం కట్టలు తెంచుకుంటోంది. అసహనం స్థాయి దాటిపోతోంది. ఇదంతా రోజూ మీడియా దృష్టిలో నుంచి దాటని పరిణామాలే. మూడేళ్ల పాలన అది కూడా బంపర్ మెజారిటీతో వైసీపీకి అధికారాన్ని జనాలు కట్టబెట్టిన తరువాత జరుగుతున్న పాలన. మరి ఆ పాలనలో తమ వాటా ఏంటి అని కార్యకర్త నుంచి నాయకుడి దాకా అంతా అనుకోవడంలో తప్పేమీ లేదు. అయితే జగన్ పాలనలో అంతా పంచుడు కార్యక్రమం మాత్రమే జరుగుతోంది. అది కూడా జగన్ ఒక్క చోట బటన్ నొక్కితే దిగువ స్థాయిలోకి అలా నగదు వెళ్లిపోతోంది.

మధ్యలో ఎవరి ప్రమేయం లేదు. దాంతో క్యాడర్ కి ఏమిటి విలువ. ఇది ఒకటి నిరుత్సాహానికి కారణం. ఆ మీదట పలుకుబడి సమస్య. ఇక పైసలు నాలుగు తమ ప్రభుత్వంలో సంపాదించుకుందామన్న ఆశ అయితే దండీగా ఉంటుంది. కానీ అది ఎక్కడా నెరవేరడంలేదు. దాంతో టాప్ టూ బాటం అంతా గప్ చుప్ అయ్యారు. మూడేళ్ళ తరువాత గడప గడపకు అంటే కార్యకర్త కదలలేదు, పార్టీకి పండుగ లాంటి ప్లీనరీ అన్నా కూడా ఎవరు రియాక్ట్ కావడంలేదు.

దాంతో పాటు సొంత పార్టీ సమావేశాల్లోనే కొందరు నాయకులు, కార్యకర్తలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దీని మీద గోదావరి జిల్లాల మంత్రి దాడిశెట్టి రాజా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. క్యాడర్ లో నిండా నిరుత్సాహం ఉంది అని ఆయన చెప్పుకున్నారు. ఒప్పుకున్నారు. అయితే ఆ నిరుత్సాహం అంతా పైసలు వారికి దక్కలేదు, గౌరవం లేదు అన్న దాని దగ్గరే ఆగిపోయింది అని కూడా తనదైన శైలిలో విశ్లేషించారు.

గత టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి నుంచి దిగువ స్థాయి కార్యకర్త వరకూ అంతా సంపాదించుకున్నారని అదే వైసీపీలో అయితే అసలు వీలుపడడంలేదని, ఇది క్యాడర్ లో బాధకు ఒక కారణం అయి ఉంటుందని అన్నారు. జగన్ ఏలుబడిలో పారదర్శకమైన పాలన సాగుతోందని మంత్రి అనడం విశేషం. అదే టీడీపీ పాలనలో అయితే జన్మ భూమి కమిటీల ద్వారా పనులు పధకాలు అన్నీ జరిగేవని, దాంతో వారు జేబుల్లోకే అంతా పోయేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

ఇంకో వైపు చూస్తే బాత్రూం పధకాల నుంచి ప్రతీ పధకంలో వాటాలేసుకుని మరీ పసుపు పార్టీ నేతలు దాచుకున్నారని ఆయన ఆరోపించారు. అలాంటివి ఏవీ తమ ప్రభుత్వంలో లేకపోవడంతో క్యాడర్ లో కొంత నిరుత్సాహం ఉందని, తన లాంటి వారు కూడా నిరాశ పడిన మాట వాస్తవం అని ఆంతరంగాన్ని ఆయన ఆవిష్కరించారు. అయితే మంత్రి గారు చెప్పిన మాటల కంటే చెప్పని మాటలే ఎక్కువ ఉంటాయని అంటున్నారు. ఆయన మంత్రి అయినా నిరాశగా ఎందుకు ఉన్నారన్నది తెలియాల్సి ఉందని కూడా అంటున్నారు.

ఇంకో వైపు కార్యకర్తలు పైసలు దక్కకపోవడం విలువ లేకపోవడం కంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసలు పట్టించుకోకపోవడం అసలైన బాధ అని అంటున్నారు. దాన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయిన వారు ఈ రోజుకీ గుర్తించడంలేదని అంటున్నారు. పైగా వారిని అవినీతిపరులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని కూడా అంటున్నారు. ఇప్పటికైనా నిజాయతీగా సమీక్ష చేసుకుని క్యాడర్ ని దగ్గరకు తీసుకోకపోతే మాత్రం వైసీపీ ఇబ్బందులను ఎదుర్కోవదం తధ్యమని అంటున్నారు.