Begin typing your search above and press return to search.

సీఎం పదవి ఇస్తామన్నా.. నో చెప్పేసిందట

By:  Tupaki Desk   |   20 Sep 2021 3:59 AM GMT
సీఎం పదవి ఇస్తామన్నా.. నో చెప్పేసిందట
X
ఇప్పుడు రోజులన్ని ఎలా ఉన్నాయి? పదవి ఇస్తానని చెప్పాలే కానీ వెనుకా ముందు చూసుకోకుండా.. సిద్ధాంతాల పట్టింపు.. ఏ పార్టీలో చేరతామన్నది ఆలోచించకుండా పదవులు కోసం పరుగులు తీసే పరిస్థితి. అలాంటిది.. పిలిచి మరీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే నో చెబుతారా? అంటే సాధ్యమే కాదని చెబుతాం. కానీ.. తాజాగా అలాంటి పనే చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత.. పార్టీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీకి అత్యంత సన్నిహితురాలైన అంబికా సోని. ఈ సందర్భంగా ఆమె వినిపించిన వాదన ఆసక్తికరంగా మారింది.

ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కినుకు వహించిన అమరీందర్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవటం తెలిసిందే. తాజాగా చన్నీని సీఎంగా నియమిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ముందు.. ఆ పదవిని చేపట్టాలంటూ అంబికా సోనిని పలుమార్లు సంప్రదించినా.. ఆమె మాత్రం ఆ పదవిని తీసుకునేందుకు నో చెప్పేశారు.

పంజాబ్ ముఖ్యమంత్రిగా సిక్కుయేతర వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి.. ఉప ముఖ్యమంత్రి పదవికి ఒక సిక్కు నేత.. మరో దళిత సిక్కునేతను నియమించటం ద్వారా అదిరే కాంబినేషన్ అవుతుందని భావించారు. ఇందులో భాగంగా అంబికా సోనికి సీఎం పదవిని ఆఫర్ చేవారు. అందుకు ఆమె నో చెప్పటమే కాదు.. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఒక సిక్కునేత కావాలనేదే యాభై ఏళ్ల నుంచి తన గట్టి అభిప్రాయమని స్పష్టం చేసిన ఆమె.. సిక్కులను సీఎంగా చేయగలిగిన ఏకైక రాష్ట్రం పంజాబ్ మాత్రమేనని.. అందుకే తాను ఆ పదవిని చేపట్టనని స్పష్టం చేశారు.

చన్నీ పేరు ప్రకటించటానికి ముందు కాంగ్రెస్ అధినాయకత్వం అంబికా సోనితో పలుమార్లు సంప్రదింపులు జరిపినా.. ఆమె మాత్రం తన వాదన నుంచి పక్కకు తప్పుకోలేదు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం.. ప్రస్తుతం పాక్ పరిధిలోని లాహోర్ లో జన్మించిన అంబికా సోని.. హిందువు అన్న విషయం తెలిసిందే. పార్టీకి సీనియర్ నేతగా.. పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అంబికా సోని అయితే అందరిని కలుపుకుపోతారని కాంగ్రెస్ పార్టీ భావించింది. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్న కీలక వేళలో.. ఆమె సారథ్యంలో అయితే.. విభేదాలు సద్దుమణుగుతాయని భావించింది. కానీ.. అంబికా మాత్రం ‘సిక్కు’ సెంటిమెంట్ ను తెర మీదకు తీసుకురావటం.. సీఎం పదవిని వద్దని చెప్పటం ద్వారా ఇప్పుడామె వార్తల్లో వ్యక్తిగా మారారు.