Begin typing your search above and press return to search.

112 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో రిపీట్ అయిన సీన్

By:  Tupaki Desk   |   25 May 2020 4:30 AM GMT
112 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో రిపీట్ అయిన సీన్
X
ముస్లింలు అత్యంత ఘనంగా జరుపుకునే రంజాన్..ఈసారి కళ తప్పింది. ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగంతో గల్ఫ్ లోనూ పండుగ కళ తప్పింది. ఇక.. హైదరాబాద్ మహానగరంలో రంజాన్ వచ్చిందంటే చాలు.. లైఫ్ స్టైల్ మొత్తంగా మారిపోతుంది. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ హలీమ్ ను పెద్ద ఎత్తున తీసుకోవటం ఒకటైతే.. పండుగ సమయాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత చేసే నైట్ షాపింగ్ మరెప్పటికి సాధ్యం కాదు.

ఇలా.. రంజాన్ అన్నంతనే గుర్తుకు వచ్చే ఉదంతాలెన్నో. దాదాపు 112 ఏళ్ల తర్వాత మళ్లీ రంజాన్ పండుగ ఉత్సాహం ఆవిరి అయ్యిందని చెప్పాలి. 1908 సెప్టెంబరు 26-28 తేదీల్లో భారీగా వరదలు వచ్చాయి. 36 గంటల పాటు కురిసిన వర్షాలతో వరద పోటుతో నగరం విలవిలలాడింది. ఏకంగా 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 20 వేలకు పైగా ఇళ్లు నేలమట్టాయి. అంతటి భారీ నష్టం నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన రంజాన్ సీజన్ కళ తప్పింది. కట్ చేస్తే.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రంజాన్ పండుగ ఎవరిళ్లలో వారు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పదు.

లాక్ డౌన్ నేపథ్యంలో పండుగ హడావుడి పెద్దగా లేదని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికి వారు.. వారి ఇళ్లల్లోనే ఉండిపోయి ప్రార్థనలు చేసుకోవటం.. పిండివంటలు చేసుకోవటం కనిపిస్తోంది. రోటీన్ కు భిన్నంగా అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఒక అంచనా ప్రకారం రంజాన్ సీజన్ లో జరిగే రూ.1200 కోట్ల వ్యాపారం దెబ్బ తిన్నట్లుగా చెబుతున్నారు. ప్రధానంగా వస్త్ర వ్యాపారం భారీగా నష్టపోయినట్లు చెబుతున్నారు. రంజాన్ సీజన్ లో రూ.500 కోట్ల మేరకు వస్త్ర వ్యాపారం సాగుతుందని.. అదంతా ఈసారికి గాలికి కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.