Begin typing your search above and press return to search.

దేశంలోని ఆ కొవిడ్ సెంటర్లో జీరో కేసులు.. గ్రేట్ న్యూసేనా?

By:  Tupaki Desk   |   16 July 2020 5:15 AM GMT
దేశంలోని ఆ కొవిడ్ సెంటర్లో జీరో కేసులు.. గ్రేట్ న్యూసేనా?
X
గొప్పలు చెప్పుకోవటానికి. వాస్తవానికి మధ్య ఉండే దూరం ఎక్కువే. కాకుంటే.. గొప్పలు చెప్పుకునే క్రమంలో వాస్తవాల్ని విస్మరించటం.. కావాలని ప్రస్తావించకపోవటం లాంటివి చేస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కొవిడ్ కేసుల నమోదు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో ఢిల్లీ మహానగరం టాప్ త్రీలో ఒకటన్నది మర్చిపోకూడదు.

అలాంటి మహానగరంలో ఏర్పాటు చేసిన తొలి కోవిడ్ సెంటర్ లో తాజాగా కేసులు జీరో అయ్యాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికి నిత్యం వేలల్లోనే ఉంటారు. అంతలా పాజిటివ్ కేసులు నమోదు అయితే..కోవిడ్ సెంటర్లో పేషెంట్లు జీరో కావటం వెనుక ఏదో లెక్క తేడా ఉంటుందనే చెప్పాలి. అధికారుల ప్రచారానికి.. వాస్తవానికి మధ్య ఉన్న విషయం ఏమిటన్నది చూసినప్పుడు అసలు విషయం ఇట్టే అర్థం కాక మానదు.

ఢిల్లీలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన తొలి కొవిడ్ సెంటర్ గా షెహనాయ్ బ్యాంకెట్ హాల్ ను చెబుతారు. వంద పడకలతో దీన్ని ఏర్పాటు చేశారు. ఒకదశలో ఒకేసారి గరిష్ఠంగా 60 మంది చేరటం అధికారులు ఆందోళనకు గురయ్యారు. అలాంటి ఈ సెంటర్ లో జులై 15 నాటికి ఒక్క పేషెంట్ కూడా లేరు. ఈ విషయాన్ని అధికారులు గొప్పగా చెప్పుకోవటం గమనార్హం.

అయితే.. ఈ సెంటర్లో ఉండాల్సిన పేషెంట్లలో కొద్దిమందిని తూర్పు ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ కోవిడ్ కేర్ సెంటర్ కు వెళ్లటంతో ఇలాంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ సెంటర్ ను ఎల్ఎన్ జేపీ ఆసుపత్రికి అనుసంధానం చేయటంతో రోగుల సంఖ్య బాగా తగ్గినట్లుగా చెబుతున్నారు. గతంలో ఆసుపత్రికి వంద నుంచి నూటపదిమంది వస్తే.. ఇప్పుడు యాభై అరవై మంది మాత్రమే వస్తున్నట్లు చెబుతున్నారు. అధికారులు చెప్పే గొప్పలకు.. వాస్తవానికి మధ్య అంతరం ఎలా ఉంటుందన్నది తాజా ఉదంతం చెప్పేస్తుందని చెప్పాలి.