Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ ని హెచ్చరించిన జగన్.?

By:  Tupaki Desk   |   20 Nov 2019 5:57 AM GMT
వైసీపీ ఎంపీ ని హెచ్చరించిన జగన్.?
X
ఒక్కమాట ఎంత పనిచేసింది.. వైసీపీ ఎంపీ నోరు జారిన వైనం ప్రతిపక్ష టీడీపీ కి ఆయుధమైంది. పార్టీ స్టాండ్ కు భిన్నంగా పార్లమెంట్ లో వాయిస్ వినిపించిన ఆ ఎంపీ కి సీఎం జగన్ చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. ఇప్పుడీ వ్యవహారం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట..

పార్లమెంటు లో ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువులపై దుమారం రేపింది. టీడీపీ ఎంపీ కేశినేని దీన్ని లేవనెత్తడం.. ఏపీ లో తెలుగు భాషను బతికించాలంటూ కేంద్రాన్ని కోరడం పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ ఎంపీలు కేశినేని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయితే ఈ క్రమంలోనే మాట్లాడిన వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రాంగ్ స్టెప్ వేశారు. అదే ఇప్పుడు తెలుగుదేశం పాలిట అస్త్రంగా మారింది.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్ లో 'ఇంగ్లీష్ మీడియం' చదువుల పై చర్చ సందర్భంగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా లైన్ తీసుకొని మాట్లాడడం కలకలం రేపింది. తెలుగు భాష ఉన్నతికి కేంద్రం సహకరించాలని ఆయన అనడం వైసీపీ తోటి ఎంపీలను సైతం నివ్వెరపరిచింది. అయితే అలా తెలిసి అన్నాడో ఫ్లోలో అన్నాడో కానీ అది టీడీపీ కి అస్త్రమైంది. జగన్ పార్టీ ఎంపీలు తెలుగు భాష ఉన్నతికి కోరుతుంటే జగన్ మాత్రం సమాధి చేస్తున్నాడంటూ టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు.

ఈ వివాదం రాజుకోవడం పై సీఎం జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పేదల కోసం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువుల కు వ్యతిరేకంగా ఏ ఎంపీ మాట్లాడినా పార్టీ పరంగా చర్యలు తప్పవని రఘురామకృష్ణం రాజును జగన్ హెచ్చరించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. రఘురామకృష్ణం రాజు నుంచి వివరణ తీసుకోవాలని గోదావరి జిల్లాల పార్టీ ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డి ని ఆదేశించినట్లు సమాచారం.