Begin typing your search above and press return to search.

జగన్ కొత్త వ్యూహం.. కాబినెట్ లో మహిళలకు పెద్ద పీట..?

By:  Tupaki Desk   |   24 Nov 2021 5:30 PM GMT
జగన్ కొత్త వ్యూహం.. కాబినెట్ లో మహిళలకు పెద్ద పీట..?
X
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయన్నది చెప్పలేం.ఒక పరిణామం పరిస్థితుల్ని పూర్తిగా మార్చేస్తుంది. తాజాగా ఏపీ రాజకీయాలు ఇదే తీరులో ఉన్నాయి. విపక్ష చంద్రబాబును మాటలతో ఉతికి ఆరేసే విషయంలో అధికార వైసీపీ నేతలు ఎంతటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న అవకాశం వచ్చినా.. చంద్రబాబును ఆయన కుమారుడు లోకేశ్ ను రాయలేని భాషలోనూ తిట్టేందుకు వెనుకాడని వైనం తెలిసిందే. ఇలా తిట్టే ధోరణి అంతకంతకూ పెరిగిపోయి.. వల్లభనేని వంశీ.. కొడాలి నాని లాంటి వారి నోటి నుంచి వచ్చే మాటలకు.. మరో ఎమ్మెల్యే అంబటి రాంబాబు లాంటి వారు తమ మాటల పెట్రోల్ ను కాసింత పోసి మరింత కాక పెంచటం తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లోనే మొన్నటి అసెంబ్లీ సమావేశంలో విపక్షనేత చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం.. అది కాస్త రచ్చ రచ్చగా మారటం.. ఏనాడు రాజకీయాల గురించి పెద్దగా స్పందించని నందమూరి కుటుంబం సైతం బయటకురావటం తెలిసిందే. సాధారణంగా బాబును .. ఆయన తీరును తప్పు పట్టే వారు సైతం.. వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల వేళ.. ఆయనకు దన్నుగా నిలవటమే కాదు.. ఇలాంటి భాష ఏ మాత్రం సమంజసం కాదని చెప్పటం తెలిసిందే.

మొదట్లో వైసీపీ నేతలు భువనేశ్వరి ఎపిసోడ్ ను లైట్ తీసుకోవటం.. ఎప్పటిలానే బాబును తమ మాటలతో బుల్ డోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆర్కే రోజా మొదలు పలువురు వైసీపీ నేతలు మాట్లాడారు. అయితే.. బాబు కన్నీటి ఎపిసోడ్ లెక్కల్ని మార్చేయటం.. వైసీపీ నేతల దూకుడుతనంతో పాటు.. ముఖ్యమంత్రి జగన్ సైతం ఆచితూచి అన్నట్లుగా మాట్లాడిన వైనంతో సమ్ థింగ్ రాంగ్ అన్నట్లుగా మారింది.

మొత్తంగా భువనేశ్వరి ఎపిసోడ్ వైసీపీకి డ్యామేజ్ గా మారింది. దీన్ని సరిదిద్దుకునేందుకు జగన్ కొత్త వ్యూహానికి తెర తీసినట్లుగా భావిస్తున్నారు. త్వరలో మంత్రివర్గం మొత్తాన్ని మార్చేయాల్సి ఉన్నందున.. తాజా కూర్పులో మహిళలకు పెద్ద పీట వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కాబినెట్ లోముగ్గురు మహిళలకు మంత్రిపదవులు ఇచ్చిన జగన్.. కొత్త కాబినెట్ లో మాత్రం అందుకు భిన్నంగా ఆరుగురికి చోటు కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది.

మహిళలకు తమ పార్టీ ఇచ్చే ప్రాధాన్యం ప్రజలకు అర్థమయ్యేందుకు వీలుగా తాజా ఎత్తుగడను అనుసరించనున్నట్లు చెబుతున్నారు. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామం.. అటు తిరిగి ఇటు తిరిగి మహిళలకు కొత్త కాబినెట్ లో పెద్ద పీట వేస్తారన్న మాట వైసీపీ మహిళా నేతల్లో ఆనందానికి గురి చేసేలా చేస్తే.. నేతలకు మాత్రం కొత్త గుబులుగా మారింది. ఎవరికొచ్చే ఛాన్సు చేజారుతుందో అర్థంకాక కొత్త కన్ఫ్యూజన్ కు తెర లేచినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. వివిధ వర్గాలకుచెందిన మహిళలకు కాబినెట్ లో చోటు కల్పించేలా కసరత్తు ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఆ లక్కీ ఛాన్సు ఎవరికో చూడాలి.