జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

Thu Sep 23 2021 19:28:47 GMT+0530 (IST)

Ys Jagan Govt sensational decision

సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న ఏపీ సీఎం జగన్ మరో విప్లవాత్మక చర్యకు పూనుకున్నారు. రెవెన్యూ వ్యవస్థ అంటేనే అవినీతి నడుస్తుందన్న విమర్శ ఉంది. దాన్ని తగ్గించేందుకే ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలు పెట్టి ప్రభుత్వ పాలనను జగన్ ప్రజలకు చేరువ చేశారు. సచివాలయాల పాలన దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వర్ధమాన ఐఏఎస్ లకు పాఠాలుగా కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఏపీలో బాగా హిట్ అయిన ఈ సచివాలయాల విషయంలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.ఆంధ్రప్రదేశ్ లో ఇకపై భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది.

ఇందులో భాగంగానే తొలి దశలో త్వరలో 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ ద్వారా సిబ్బందికి ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు.

అతిత్వరలోనే 51 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పారదర్శకత కోసమే గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేపడుతున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు.