అందుకు ఒప్పుకోలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి

Sun Dec 05 2021 11:00:01 GMT+0530 (IST)

Young woman who poured acid on Boyfriend

సాధారణంగా తన ప్రేమకు ఒప్పుకోవడం లేదని ప్రేమికుడు యువతులపై యాసిడ్ పోయడం చూశాం. కానీ ఇక్కడ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. ఏకంగా యువతియే తనతో సహజీవనం చేయడం లేదని ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. తనను వదిలేస్తున్నాడని ఇటీవల కేరళలో ఓ యువతి ఏకంగా యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. తాజాగా ఈ ఘటన మరిచిపోకముందే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో సేమ్ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.సహజీవనానికి నో చెప్పాడని ప్రియుడిపై యువతి యాసిడ్ దాడి చేసింది. కోయంబత్తూరుకు చెందిన జయంతి (27) కేరళకు చెందిన రాకేష్ (30) కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల కేరళలో సొంతూరుకు వెళ్లిన రాకేష్ తిరిగి వచ్చిన తర్వాత జయంతితో సంబంధాన్ని తెంచుకునేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలోనే తనకు పెళ్లైందని.. ఇకపై సహజీవనం కుదరదని తేల్చిచెప్పాడు. దీంతో జయంతికి తీవ్రమైన కోపం వచ్చింది. రాకేష్ దూరం కావడాన్ని తట్టుకోలేకపోయింది. రాకేష్ పై అదును చూసి యాసిడ్ తో దాడి చేసింది.

ఆ తర్వాత భయంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.