Begin typing your search above and press return to search.

యువతి కిడ్నాప్..యూట్యూబ్ చూసి ప్లాన్..షాకైన పోలీసులు

By:  Tupaki Desk   |   28 Feb 2020 7:30 PM GMT
యువతి కిడ్నాప్..యూట్యూబ్ చూసి ప్లాన్..షాకైన పోలీసులు
X
కడప నగరంలో కిడ్నాప్ అయిన యువతి వ్యవహారం ఏపీలో సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన పోలీసులు కేవలం 10 గంటల్లోనే కిడ్నాపర్ ను పట్టుకొని యువతిని రక్షించి శభాష్ అనిపించుకున్నారు.

సినిమా థ్రిల్లింగ్ ను తలపించేలా సాగిన ఈ కిడ్నాప్ ఉందంతంలో కిడ్నాపర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడు చెప్పిన మాటలు విని షాక్ కు గురయ్యారు. ఇలాంటి కిడ్నాపర్ ను ఎప్పుడూ చూడలేదని కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలుపడం విశేషం.

కడప వైవీ స్ట్రీట్ కు చెందిన 21 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసింది ఆమెకు ఇంజనీరింగ్ లో చదువు చెప్పిన ప్రొఫెసరే. ఇప్పుడు గ్రామ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. డేరంగుల కృష్ణమోహన్ (33) అనే వ్యక్తియే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా పెళ్లి చేసుకుంటానని యువతి వెంటపడుతున్నాడు.

బుధవారం రాత్రి యువతి ఇంట్లోనే ఒంటరిగా ఉందని తెలుసుకొని కృష్ణమోహన్ బురఖా వేసుకొని ఇంట్లోకి వెళ్లి యువతిని బెదిరించి బలవంతంగా ఇంటికి తాళం వేసి తీసుకెళ్లాడు. స్థానికులు చూసి తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నెల్లూరు, తమిళనాడుల్లో వెతికారు. యువతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాపర్ వేలూరులో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే కిడ్నాపర్ ను అరెస్ట్ చేశారు.

యువతిని కిడ్నాప్ చేసి తాళం వేసిన కృష్ణ మోహన్ ఆ యువతి ఇంట్లో పుర్రె, ఎముకలు వేసి పెట్రోల్ పోసి గ్యాస్ లీక్ చేసి వచ్చాడు. వచ్చేటప్పుడు ఒక క్యాండిల్ ను వెలిగించి వచ్చాడు. క్యాండిల్ కరిగి పెట్రోల్ కు అంటుకొని గ్యాస్ లీక్ అయ్యి ఇళ్లు తగలబడి యువతి కాలిపోయిందని అనుకుంటారని.. పుర్రె, ఎముకలు వేశాడు. అయితే పోలీసులు వచ్చి క్యాండిల్ ఆర్పి గ్యాస్ బంద్ చేయడంతో ఇళ్లు తగలబడకుండా పెద్ద ప్రమాదం తప్పింది.

ఇలా యూట్యూబ్ లో చూసి కిడ్నాపర్ యువతి కిడ్నాప్ ను పకడ్బందీ గా చేశాడు. యువతి చనిపోయిందని నమ్మించి తనతో పాటు తీసుకెళ్లాలని యోచించాడు. కానీ సెల్ ఫోన్ సిగ్నల్స్ అతడిని పట్టించాయి.