ఆ యువతి ఓవరాక్షన్ కు సరైన షాకిచ్చిన ఆ రాష్ట్ర హోం మంత్రి

Thu Sep 16 2021 17:00:45 GMT+0530 (IST)

Shreya Kalra dancing on the sidewalk as the signal fell

పాపులార్టీ పెంచుకోవటానికి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించటం ఈ మధ్యన ఎక్కువైంది. సంచలనంగా మారటం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారటం.. ట్రెండింగ్ తో సెలబ్రిటీ స్టేటసన్ ను సొంతం చేసుకోవటం.. సోషల్ మీడియాలో ఫేమస్ కావటానికి కొందరు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు.ఇలాంటి వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి సరైన రీతిలో రియాక్టు అయ్యారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సదరుయువతిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి స్పందనను ఊహించని ఆమెకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

ఇండోర్ లో అదో బిజీ జంక్షన్. రెడ్ సిగ్నల్ పడగానే ఆధునిక దుస్తులు ధరించిన ఒక యువతి అకస్మాత్తుగా వచ్చింది. ఒక పాటకు ఆమె డ్యాన్స్ చేయటం మొదలు పెట్టింది. కొద్ది క్షణాల పాటు వారికేం జరుగుతుందో అర్థం కాలేదు. అనంతరం.. ఆమె డ్యాన్సు వేయటానికి వచ్చిందన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు.

డ్యాన్సు చేసిన ఆమె.. దానికి సంబంధించిన వీడియోను తీసుకునేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంది. సదరు వీడియోను తన ఇన్ స్టా అకౌంట్లొ పోస్టుచేసింది. అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోపై రాష్ట్ర హోంమంత్రి స్పందించారు. సదరు యువతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలుజారీ చేశారు.

దీంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. ఓవరాక్షన్ పని చేసిన యువతి పేరు శ్రీయ కర్లా. బిజీగా ఉండే రసోమా స్క్వేర్ వద్ద ఆమె డ్యాన్సు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆమెపై చర్యలు రోడ్డు మీద డ్యాన్సు వేసినందుకు కాదు.. అంతకు ముందు రోడ్డు మీద మాస్క్ లేకుండా కనిపించినందుకు యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చేసే వారికి ఇలాంటి చర్యలే తగిన శాస్తి అన్న మాట వినిపిస్తోంది.