యువతి బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ లో 'సెక్స్'.. తొలగించాలని ఫిర్యాదు

Sun Dec 05 2021 13:00:01 GMT+0530 (IST)

Young woman complains to remove registration number

ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా బైక్ లు కొనేస్తున్నారు. స్కూటీలపై రయ్యిమని దూసుకెళుతున్నారు. బైకులంటే అందరికీ అంత మోజు.  అందులోనూ ఆటోమొబైల్ కంపెనీలు ఆడపిల్లల కోసం ప్రత్యేక డిజైన్లతో బైకులను మార్కెట్లో దించుతున్నారు. దీంతో అమ్మకాలు భారీగా పెరిగాయి.ఢిల్లీలో ఉంటున్న ఓ అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తోంది.కాలేజీకి వెళ్లేందుకు జంకాపురి నుంచి నోయిడా వరకూ మెట్రోలో ప్రయాణించింది. రద్దీగా ఉండే మెట్రోలో ప్రయాణించలేక తనకెంతో ఇష్టమైన బైక్ కావాలని తండ్రిని అడిగింది. ఆమె తండ్రి ఒకంతట ఒప్పుకోలేదు.

ఏడాదిపాటూ తండ్రిని బతిమిలాడి చివరకు గత నెలలో బండి కొనుక్కుంది. బైకును రిజిస్ట్రేషన్ చేయించింది. ఆ బండికి ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ అమ్మాయికే కాదు.. ఆ కుటుంబానికి తలనొప్పిగా మారింది. చుట్టుపక్కల వాళ్లంతా ఆ బండి నెంబర్ చూసి కామెంట్లు చేయడం.. నవ్వుకోవడం చేస్తున్నారు.

ఇక ఆ అమ్మాయి కాలేజీకి వెళుతుంటే దారిలో ఎంతోమంది ఆమెను చూసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆమె బండికి కేటాయించిన నెంబర్ ఏంటంటే DL3 SEX **** . ఆ నెంబరు ప్లేటు బండికి ముందు వెనుకా కూడా పెట్టించారు. దీంతో ఆ అమ్మాయి బండి నడిపేందుకు భయపెడుతోంది. ఆకతాయిల మాటలు భరించలేక ఇంట్లో బైకు వదిలి మెట్రోలోనే ప్రయాణం చేస్తోంది.

కుటుంబ సభ్యులు ఢిల్లీ ఆర్టీవో అధికారులకు సమస్య చెప్పి రిజిస్ట్రేషన్ నంబర్ మార్చాలని కోరినా వారు వీలుకాదని తేల్చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు తాము ఇవ్వమని.. అవి ఆటోమేటిక్ గా ఒక సిరీస్ లో కేటాయింపు జరుగుతుందని తెలిపారు.

అయితే ప్రజల మనోభవాలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అభ్యంతరక సిరీస్ లను నిలిపివేసినట్టు తెలిపారు. కానీ ఆ అమ్మాయి బండి నంబర్ మార్చడం కుదరదన్నారు. ఆ బండిని అమ్మేసి కొత్త బండి కొనుక్కోవడం ఇక మార్గం అని తెలుస్తోంది.