Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ ఘాటు విమర్శలు.... యూపీ బీజేపీ సీఎం రాయబారి జగన్ తో

By:  Tupaki Desk   |   25 Jan 2023 8:39 AM GMT
ఏపీ బీజేపీ ఘాటు విమర్శలు.... యూపీ బీజేపీ సీఎం రాయబారి జగన్ తో
X
బీజేపీ లో తలో విధంగా పరిస్థితి ఉంటుంది. ఏపీలోనే వర్గ పోరు ఉంది. కొందరు వైసీపీకి అనుకూలంగా సౌండ్ చేయరు, మరికొందరు తెలుగుదేశంతో పొత్తుకు పోదామని అంటారు. ఇంకొందరు అసలైన కమలం లా వికసించాలంటారు. ఈ విభేదాలు ఇలా ఉండగానే కేంద్రం నుంచి వచ్చే మంత్రులు కొందరు ఏపీ సర్కార్ గురించి అసలు మాట్లాడరు, కొందరు మంత్రులు జగన్ ఇంటికి వెళ్ళి శాలువా కప్పుకుంటారు. మరికొందరు మాత్రం ఘాటైన విమర్శలు చేస్తూ ఉంటారు.

టోటల్ గా కమలం లేచింది కాషాయ జెండా అని ధాటీగా ఏదో చెప్పాలనుకున్న టైం లోనే ఒక్కసారిగా నీరు కార్చేస్తారు. ఏపీ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను భీమవరంలో ఏర్పాటు చేసుకుంది. ప్రెసిడెంట్ సోము వీర్రాజు నుంచి కేంద్ర మంత్రుల దాకా అంతా జగన్ మీద బాణాలు ఎక్కుపెట్టారు. కేంద్ర మంత్రి మురళీధర్ అయితే ఏపీలో నిరాశాపూరితమైన పాలన సాగుతోంది అని పెద్ద బండ వేశారు. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని, పాలన లేదు, ఏమీ లేదు అని ఎత్తి పొడిచారు.

సరిగ్గా ఆ టైం లో మరో ముచ్చట జరిగింది. యూపీలో బీజేపీకి ఐకాన్ లాంటి నేత, భావి ప్రధానిగా కీర్తించబడుతున్న వారు, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ తరఫున వచ్చి ప్రచారం చేసే యోగీ ఆదిత్యానాధ్ తన రాయబారిగా ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రాను పంపించారు. ఆయన జగన్ తో భేటీ అయి ఏపీలో పలు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.

ఏపీలో సంక్షేమ పధకాల తీరు తెన్నుల గురించి స్వయంగా యోగీ ఆదిత్యనాధ్ ఆ విధంగా వాకబు చేస్తున్నారు అన్నమాట. ఏపీలో విద్య, వైద్యం రంగాలలో వేల కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. బడ్జెట్ లో పెద్ద మొత్తంలో కేటాయిస్తోంది. నాడు నేడు కింద పాఠశాలలు అభివృద్ధి చేస్తోంది. పాఠశాలలలో నాణ్యమైన భోజనంతో మెనూ ఉంది. అలాగే రక్షిత మంచినీరు అందిస్తున్నారు. ఇక వైద్య రంగానికి కూడా కార్పోరేట్ స్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారు.

అలాగే విలేజ్ క్లినిక్స్ ని నిర్మిస్తోంది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో పాటు వైఎస్సార్ జలకళ పేరిట కార్యక్రమాలు చేపడుతోంది. ఈ మూడు పధకాల గురించి తెలుసుకోవడానికి సాకెత్ మిశ్రా వచ్చారు. ఆయనకు సంక్షేమ పధకాల గురించి వివరించిన జగన్ ఏపీలో తమ ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఖర్చు చేస్తోందో తమ ప్రయారిటీస్ ని ఎలా అమలు చేసి చూపిస్తున్నామో చెప్పుకొచ్చారు. ఈ పధకాలను యూపీలో అమలు చేయడానికి యోగి ఆదిత్యనాధ్ ఇలా తమ రాయబారిని పంపించారు అని అంటున్నారు.

దీంతో వైసీపీ నేతలు స్పందిస్తూ ఏపీ బీజేపీ నేతలకు అభివృద్ధి ఏమీ కనిపించకపోయినా అదే పార్టీకి చెందిన యోగీ ఆదిత్యనాధ్ కి మాత్రం ఏపీ సంక్షేమం మీద ఆసక్తి పెరిగిందని అంటున్నారు. మొత్తానికి బీజేపీ నేతలు జగన్ పాలనను దుయ్యబెడుతున్న టైం లో ఇలా యోగీ ఆదిత్యనాధ్ రాయబారి వచ్చి మొత్తం గాలి తీసేశారు అని మధన పడుతున్నారు. ఏది ఏమైనా ఏపీ బీజేపీకి కాలం ఖర్మం కలసిరావడం లేదు అనడానికి ఈ ఉదాహరణ చాలేమో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.