యోగా చేసిందని మతం నుంచి బహిష్కరించారట!

Fri Aug 10 2018 13:14:14 GMT+0530 (IST)

Yoga Religious Boycott in Machareddy Because of Yoga

డిజిటల్ యుగంలోనూ ఇంకా మతాలు.. కులాలు అంటూ కొందరు వేసే వెర్రి వేషాలు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. కొన్నింటికి మతంతో సంబంధం లేకున్నా.. వాటిని బలవంతంగా మతం చట్రంలో చూడటం ఈ మధ్యన ఎక్కువైంది. అలాంటి అతిగాళ్లతో లేనిపోని ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.నువ్వు ఒకటి చేస్తే.. నేను రెండు చేస్తానన్న చందంగా మతవాదుల పుణ్యమా అని ఇబ్బందికర పరిస్థితులు తెర మీదకు వస్తున్నాయి. యోగాను హిందూ మతానికో.. మరో మతానికో పరిమితం చేయటం దుర్మార్గం. ఒక మంచి ప్రక్రియను మతం కోణంలో చూడటం సరైంది కాదు. ఆ మాటకు వస్తే.. ప్రాశ్చాత్య దేశాలతో పాటు.. మరికొన్ని దేశాలు సైతం యోగాను ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేసినందుకు తనను మతం నుంచి బహిష్కరించినట్లుగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన షహనాజ్ ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. యోగా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఓం శాంతి కేంద్రంలో తానుయోగా చేశానని.. దీంతో పలువురు ముస్లిం యువకులు తనపై దాడి చేశారని వాపోయింది.

తనపై దాడి చేయటంతో పాటు.. తనను మతం నుంచి బహిష్కరించినట్లుగా పేర్కొంది. ఆరోగ్యం కోసం యోగా చేయటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించిన ఆమె.. తనపై దాడి చేసినటప్పుడు తీసిన వీడియోను వైరల్ చేసి తనను అవమానానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.

తనతో ఎవరూ మాట్లాడినా రూ.5వేల ఫైన్ వేయటంతో తనతో ఎవరూ మాట్లాడటం లేదని.. తనతో మాట్లాడిన వారిపైనా బహిష్కరణ వేటు వేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. మసీదుకు చందా ఇచ్చినా తీసుకోవటం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ తరహా మూఢత్వాన్ని ఆదిలోనే తుంచేయటం.. ఇలాంటి భావజాలాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవటం తప్పనిసరి. లేని పక్షంలో.. మరిన్ని విపరిణామాలకు మనమే కారణమవుతామన్నది మర్చిపోకూడదు.