Begin typing your search above and press return to search.

రాజధాని రైతులని కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ..ఎందుకంటే

By:  Tupaki Desk   |   29 Nov 2021 7:30 AM GMT
రాజధాని రైతులని కలిసిన వైసీపీ ఎమ్మెల్యే  ..ఎందుకంటే
X
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే ప్రకటించాలంటూ అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ నవంబర్‌ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు రైతులు.. 45 రోజుల పాటు నిర్వహించాలని.. డిసెంబర్‌ 15వ తేదీకి తిరుమలకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.రాజధాని రైతుల మహా పాదయాత్రకు ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి. అయితే, ఈ పాదయాత్రకు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం తెలపడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ రోజు ఉదయం రైతుల విరామ శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇంకో వారం రోజులు మా నెల్లూరు జిల్లాలోనే ఉంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది అయినా నాకు వెంటనే ఫోన్ చేయండి అని భరోసా ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, అలాగే పాదయాత్ర చేస్తోన్న మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. వరద బాధితుల పరామర్శ పర్యటన మధ్యలో రాజధాని రైతులని కలిశా, వర్షాల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయమని అందరికీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చానని తెలిపారు. మహిళా రైతులు అమరావతికి మద్దతివ్వమని కోరారు, పార్టీ ఏ స్టాండ్ లో వెళ్తే అదే నా స్టాండ్ అని చెప్పానన్నారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో వరదలు, వర్షాల వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకూడదు అనేది నా ఉద్దేశం, అదే మానవత్వం, సంస్కారం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇటీవల అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న సమయంలో, తిరిగి మరో కొత్త బిల్లు సభలో ప్రవేశ పెడతామని తేల్చి చెప్పారు. మొత్తం వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటు జపం చేస్తూ ఉంటే, అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనను, పాదయాత్రను అడుగడుగునా వ్యతిరేకిస్తుంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా పాదయాత్ర చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి తన సంఘీభావాన్ని ప్రకటించారు.ఇప్పటికే వైసీపీ కీలక నేతలు కొందరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఫోన్ చేసి ఈ వ్యవహారంపై మాట్లాడినట్టు సమాచారం.