ఒకవైపు మోడీ.. మరోవైపు... సిన్హా.. హైదరాబాద్ పాలిటిక్స్ గరం.. గరం..!

Fri Jul 01 2022 06:00:01 GMT+0530 (IST)

Yashwant Sinha and modi hyderabad tour

ఇప్పుడు దేశం మొత్తం.. హైదరాబాద్ వైపే చూస్తోంది. ఇక్కడ ఏం జరుగుతుంది?  ఎలాంటి పరిణామాలు ఉంటాయి?  అనే అంశాలపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. జూలై 1 2 3 తారీకుల్లో తెలం గాణలో చోటు చేసుకోనున్న పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో రాజకీయ వాతావరణం.. మరింత వేడక్కనుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరంలో రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.ఈ సమావేశాల కారణంగా.. దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని అంటున్నారు పరిశీలకులు.జూలై 2న హైదరాబాద్‌లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. బీజేపీ సమావేశాల్లో పాల్గొనేం దుకు ప్రధాని మోడీ.. జులై 2న నగరానికి వస్తుండగా.. అదే రోజున విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం హైదరాబాద్ వస్తున్నారు. దీంతో ఇద్దరు నేతలకు కూడా జడ్ ప్లస్ భద్రత ఉండడంతో హైదరాబాద్‌లో ప్రజలకు ఇక్కట్లు.. దేశ ప్రజలకు ఉత్కంఠ కనిపస్తున్నాయి.  

కేటీఆర్ దూకుడు...

జులై 2న హైదరాబాద్ రానున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనపై నగర మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలకు కేటీఆర్ ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు.  

సిన్హాకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి ఎవరు వెళ్లాలి..? ఎలా స్వాగతం పలకాలి..? అనే విషయాలపై ఆయన ఫుల్లు క్లారిటీ ఇచ్చేశారు. విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు కేటీఆర్ తెలిపారు.

జులై 2న ఉదయం 10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి యశ్వంత్ సిన్హా చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు జలవిహార్లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ ఎస్ సభ నిర్వహించనున్నారు. సభ తర్వాత.. సీఎం కేసీఆర్ టీఆర్ ఎస్ నేతలతో కలిసి సిన్హా భోజనం చేస్తారు.

అదే రోజున బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్రమోడీ కూడా హైదరాబాద్ రానుండటంతో యశ్వంత్ సిన్హా కార్యక్రమంపై టీఆర్ ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పరిణామాలతో హైదరాబాద్ రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.