అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని: చంద్రబాబుపై యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు!

Tue Sep 27 2022 15:07:04 GMT+0530 (India Standard Time)

Yarlagadda Lakshmi Prasad Comments Chandrababu

విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి దానికి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టడాన్ని నిరసిస్తూ ఇటీవల అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ పదవికే కాకుండా మరో రెండు పదవులైన హిందీ అకాడమీ చైర్మన్ పదవికి తెలుగు భాషా ప్రాధికార సంస్థ చైర్మన్ పదవులకు సైతం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. జగన్ నిర్ణయం తనను బాధించిందని కొద్ది రోజుల క్రితం తన రాజీనామా సందర్భంగా యార్లగడ్డ వ్యాఖ్యానించారు.కాగా మరోమారు యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వైఖరిపై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. అలాగే ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకుంది కూడా చంద్రబాబేనని హాట్ కామెంట్స్ చేశారు. ఇందుకు తానే ప్రత్యక్ష సాక్షినని తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. వైఎస్సార్ సంస్కారవంతుడని కొనియాడారు. కాబట్టే తెలుగు గంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. నాడు బాలకృష్ణ విషయంలో వైఎస్సార్ సహాయం కోరితే ఆయన సాయం చేశారన్నారు.

జగన్‌ను తానెందుకు తిట్టాలని.. చాలామంది తనకు ఫోన్లు చేసి కులద్రోహి తెలుగు ద్రోహి అని తిడుతున్నారని వాపోయారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన జగన్‌ను ఎందుకు తిట్టడం లేదని తనను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ 151 సీట్లు సాధించిన జగన్‌ను తాను ఎందుకు తిట్టాలి అని ప్రశ్నించారు. జగన్‌ను తిట్టి వేరే పార్టీ వాళ్లను పొగడాలా? అని నిలదీశారు.

సోనియా గాంధీ కేంద్ర మంత్రిని చేస్తానన్నప్పటికీ జగన్ ఓదార్పు యాత్ర చేసి ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. సోనియాగాంధీ అక్రమ కేసులు పెట్టించినా ఆమెను ఎదిరించి.. పార్టీని పెట్టుకుని కష్టపడి ఎన్నికల్లో గెలిచారని.. 151 సీట్లు సాధించారని చెప్పారు. జగన్ తన దృష్టిలో హీరో అని చెప్పారు. తన వల్ల ఆయనకు ఒక్క ఓటు కూడా రాదని.. అయినా తనను పిలిచి పదవి ఇచ్చారని కొనియాడారు. వైఎస్సార్ తెలుగు భాష కోసం ఎంత పాటు పడ్డారో అంత కృషిని జగన్ కూడా చేస్తున్నారని తెలిపారు. తానెప్పుడూ జగన్‌ను పల్లెత్తు మాట అనలేదన్నారు.  

తాను తన పదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకోబోనని స్పష్టం చేశారు. అయితే తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటానన్నారు. తెలుగు పాలనా భాషగా కొనసాగడానికి తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగడానికి కృషి చేస్తానని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. ఇకపై తాను ఎటువంటి రాజకీయ పదవులు చేపట్టబోనన్నారు.

ఇక రాజకీయాల గురించి తాను మాట్లాడబోనని స్పష్టం చేశారు. తనను అనవసరంగా వివాదాల్లోకి లాగి అల్లరి చేస్తే అందరి జాతకాలను బయటపెడతానని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హెచ్చరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.