జగన్ ఆర్డర్స్... యార్లగడ్డకు పదవి వచ్చేసింది

Tue Aug 13 2019 20:57:03 GMT+0530 (IST)

Yarlagadda Lakshmi Prasad Appointed As Andhra Adhikara Basha Sangham Chairman

ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానపరమైన నిర్ణయాల్లో స్పీడుగా వెళుతున్నా... నామినేటెడ్ పదవుల భర్తీలో మాత్రం అంత దూకుడు కనిపించడం లేదన్న మాట వినిపిస్తోంది. అయితే ఒక్కటొక్కటిగా అయినా కీలక పదవులను వరుసగా భర్తీ చేసుకుంటూ పోతున్న జగన్ ఇప్పటికే కీలక పదవులన్నింటినీ దాదాపుగా భర్తీ చేసినట్టుగానే భావించక తప్పదు. పదవుల భర్తీలో మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్... ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిని కూడా భర్తీ చేశారు. తెలుగు నేలకు చెందిన ప్రముఖుడు  ప్రధాని నరేంద్రమోదీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న కేంద్రీయ హిందీ అకాడెమీలో సభ్యుడిగా కొనసాగుతున్న  యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ జగన్ సర్కారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.తెలుగు రచనలను హిందీలోకి అనువదించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యార్లగడ్డ... హిందీ తెలుగు అనే తేడా లేకుండా అధికార భాషా ప్రాముఖ్యతను జనానికి చెప్పడంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి. రచయితగానే కాకుండా రాజకీయాల్లోకీ ప్రవేశించిన యార్లగడ్డ ఓ దఫా రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన వారితో మంచి సంబంధాలను కొనసాగిస్తున్న యార్లగడ్డ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా ముగిసిన ఎన్నికలకు ముందు ఒకానొక రోజు ఉన్నపళంగా జగన్ ఇంటి వద్ద ప్రత్యక్షమైన యార్లగడ్డ మీడియా దృష్టిని ఆకర్షించారు. వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు కూడా నాడు యార్లగడ్డ మీద వచ్చాయి. అయితే అదేదీ జరగకపోగా... తాజాగా జగన్ ఆయనను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో యార్లగడ్డ రెండేళ్ల పాటు కొనసాగుతారు.