పరారీలో.. యనమల తమ్ముడు?

Tue Aug 20 2019 14:54:40 GMT+0530 (IST)

Yanamala Ramakrishnudu Brother Yanamala Krishnudu Absconds

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయం కూడా సంచలనంగానే మారుతోంది. తాజాగా మాజీ మంత్రి - తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు పరారీలో ఉన్నారంటూ.. ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దీనికి కొనసాగింపుగా.. ఈ వార్తను స్థానిక పోలీసులే వెల్లడించారని చెప్పడంతో నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక విషయంలోకి వెళ్తే.. యనమల రామకృష్ణుడు ఎంత డీసెంటో.. ఆయన తమ్ముడు. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యనమల కృష్ణుడు మాత్రం ఊరమాస్. ఈ విషయం తునిలో అందరికీ తెలిసిందే.ప్రతి విషయంలోనూ వేలు పెడతారని ఆయనకు పెద్ద పేరుంది. అంతేకాదు - టీడీపీ హయాంలో వసూల్ రాజాగా కూడా గుర్తింపు పొందారు. దీంతో చిన్న చితకా వ్యాపారులు అనేకమంది అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇతర కేసులు కూడా కోకొల్లలు - భూకబ్జాలు - వసూళ్లు ఆయనకు మామూలే. అధికారుల ను బెదిరించడం ఆయనకు రాజకీయంగా అబ్బిన విద్య. అన్నగారు యనమల కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండడం - ఓడినా కూడా తమ పార్టీ టీడీపీ అధికారంలో ఉండడంతో ఒంటిచేత్తో తుని సామ్రాజ్యాన్ని ఏలేశాడు యనమల కృష్ణుడు.

ఇక తాజాగా రెండు రోజుల కిందట టీడీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. అన్నా క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ.. చేసిన ఉద్యమంలో తునిలోని అన్నా క్యాంటీన్ ముందు కృష్ణుడు తదితరులు ఆందోళన చేశారు. అనంతరం వెళ్తూ.. వెళ్తూ.. ఈ క్యాంటీన్ ను ధ్వంసం చేశారు. అయితే ఘటన జరిగిన వెంటనే దీనిని కొందరు దుండగులు చేశారంటూ.. పోలీసులకు ఈ నాయకులే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్న క్యాంటీ న్ సహా..దీనికి ఎదురుగా ఉన్న బార్ కు అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా కేసును పరిశీలించారు.

మొత్తంగా అన్నా క్యాంటీన్ అద్దాలు పగలగొట్టిన వారిలో.. యనమల కృష్ణుడుపై కేసు నమోదు చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇదే సమయంలో అప్పటికే ఉన్న అనేక కేసులను కూడా పోలీసులు పనిలో పనిగా తిరగదోడారు. ఈ నేపథ్యంలోనే ఆయన పరారై ఉంటారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏం చేసినా.. చెల్లుబాటు చేసుకున్న ఈయన ఇప్పుడు మాత్రం పరారవడం అదికూడా పోలీసులు ద్రువీకరించడం సంచలనంగా మారింది. మొత్తానికి యనమల ప్యామిలీకి ఇది మరకే!!