Begin typing your search above and press return to search.

చేతగాని తనాన్ని బయట పెట్టుకున్న యనమల

By:  Tupaki Desk   |   23 Jun 2021 12:30 PM GMT
చేతగాని తనాన్ని బయట పెట్టుకున్న యనమల
X
‘గట్టిగా పోరాడితే సాధ్యమయ్యే ప్రత్యేకహోదాను తన కేసులమాఫీ కోసమే కేంద్రానికి తాకట్టుపెడుతున్నారు’ ..ఇది టీడీపీ సీనియర్ నేత యనమల రామృష్ణుడు చేసిన ఆరోపణలు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది ఓ బ్రహ్మపదార్ధంలాగ తయారైపోయింది. విభజన చట్టాన్ని అమలుచేసేది లేదన్న రీతిలో నరేంద్రమోడి సర్కార్ 2014లో అధికారంలోకి రాగానే తన వైఖరిని స్పష్టంగా బయటపెట్టేసింది.

సజావుగా అమలవ్వాల్సిన విభజన చట్టం చివరకు రాజకీయ అనివార్యతగా మారిపోయింది. అంటే రాష్ట్రంలోని ప్రభుత్వంతో కేంద్రానికి అవసరంపడితేనే విభజన చట్టం అమలు గురించి ఆలోచించే అవసరం ఉండదన్నట్లుగా తయారైంది. కేంద్రానికి ఆ అవసరం కల్పించటంలో చంద్రబాబునాయుడు ఫెయిలయ్యారు. ఎందుకంటే 2014-18 మధ్య ఎన్డీయేలో చంద్రబాబు కూడా భాగస్వామి కాబట్టే.

భాగస్వామిగా ఉన్నన్ని సంవత్సరాలు కేంద్రం ఎలా చెబితే అలా నడచుకున్న చంద్రబాబు ఒకసారి ప్రత్యేకహోదా అని మరోసారి ప్రత్యేక ప్యాకేజీ అంటు యూటర్నులు తీసుకున్న విషయం అందరు చూసిందే. చివరికి బీజేపీ బలహీనపడిందన్న తప్పుడు అంచనాలతో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసేంతవరకు హోదాపై చంద్రబాబు చేసిన పోరాటాలేమీ లేదు.

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత మాత్రమే చంద్రబాబు ప్రత్యేకహోదా అంటే స్ధిరమైన డిమాండ్ వినిపిస్తున్నారు. ఎందుకంటే తాను సాధించలేక ఫెయిలైన డిమాండ్ లో జగన్ కూడా ఫెయిల్ అవుతారన్న అంచనాతో మాత్రమే ప్రత్యేకహోదా డిమాండ్ ను తలకెత్తుకున్నారు. గట్టిగా పోరాడితే ప్రత్యేకహోదా సాధ్యమే అయితే మరి టీడీపీ ఎందుకని పోరాడలేకపోయింది ? అంటే టీడీపీ కూడా ఫెయిలైందని యనమల అంగీకరించినట్లే కదా.

2014 లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినపుడు భాగస్వామ్య పక్షాలపై బీజేపీ ఆధారపడ్డది. 2019 ఎన్నికల ఫలితాలతో భాగస్వామ్యపార్టీలపైన కానీ ఇతర పార్టీలపైన కానీ ఆధారపడాల్సిన అవసరం కూడా బీజేపీకి లేకపోయింది. ఈ విషయాన్ని మొదట్లోనే జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. భాగస్వామిగా ఉండి చంద్రబాబే సాధించలేని పత్రేకహోదాను జగన్ ఎలా సాధిస్తాడని యనమల అనుకుంటున్నారు ?