ఏపీని నైజీరియాతో పోల్చిన యనమల

Thu Oct 06 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Yanamala About AP Economic Crisis

సీఎం జగన్ అప్పులు...దానికోసం ఆయన పడుతున్న తిప్పలపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ మొదలు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారని త్వరలోనే ఏపీ మరో శ్రీలంక కాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో పలుమార్లు విమర్శించారు. అయినా సరే ఆదాయం పెంచుకునే మార్గాలను వదిలేసిన జగన్..అప్పుల కోసం మాత్రం అన్వేషిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన విమర్శలు గుప్పించారు. మూడున్నరేళ్ల పాలనలో ఏపీని జగన్ అతలాకుతలం చేశారని వ్యవసాయం వృత్తులు వ్యాపారాలు అన్నింటినీ సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు.

ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా వందలాది వృత్తులతో జీవిస్తున్న ప్రజల జీవనం అస్తవ్యస్థంగా మారిందని పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ అంధకారం కావడం ఖాయమని చెప్పారు.

ప్రజలపై అప్పు పన్నుల భారాలు...నిలిచిపోయిన అభివృద్ధితో నైజీరియా జింబాబ్వే కంటే దారుణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందని జగన్ సీఎంగా కొనసాగితే ఏపీ మరో నైజీరియాలా మారుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ అప్పులు అసాధారణరీతిలో పెరిగాయని తాజాగా విడుదలైన కాగ్ నివేదిక చెబుతోందని యనమల చెప్పారు. అప్పుల్ని బడ్జెట్ లో చూపించకుండా ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

మూడున్నరేళ్లలో జగన్ రూ. 8 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని కానీ ప్రజల ఆదాయం పెరగలేదని అభివృద్ధీ జరగలేదని యనమల దుయ్యబట్టారు. వసూలు చేస్తున్న పన్నుల సొమ్ము ఎటు పోతోందో లెక్క లేదని అప్పులకు ఆదాయానికి సంబంధం లేదని మండిపడ్డారు. ఏపీ చేసిన అప్పులకు ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా వడ్డీలే చెల్లించాల్సి వస్తోందని ఇది లక్ష కోట్లకు చేరే అవకాశముందని ఈ భారమంతా ప్రజలపై పడుతోందని చెప్పారు.

ప్రభుత్వం 2021 మార్చి నాటికి చేసిన అప్పులు జీఎస్డీపీలో 44.04 శాతానికి చేరుకున్నాయని అప్పులు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయడమంటే రాష్ట్ర ఆర్ధిక స్థితి అధ్వాన్నంగా ఉందనడానికి నిదర్శనమని అన్నారు. మూడున్నరేళ్లలో రాష్ట్ర తలసరి అప్పు రూ. 67 వేలకు చేరుకుందని 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 331 రోజులు అప్పులు చేయాల్సి రావడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు అద్దం పడుతోందని అన్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.