టీడీపీకి బిగ్ షాక్... సాధినేని కూడా పార్టీకి గుడ్ బై?

Sun Aug 18 2019 21:27:27 GMT+0530 (IST)

Yamini Sadineni Might Bid Goodbye To TDP

అసలే తాజా ఎన్నికల్లో ఘోర పరాజయంతో నానా ఇబ్బందులు పడుతున్న తెలుగు దేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఓ వైపు పార్టీ ఘోర పరాభవంతో పార్టీ కీలక నేతలు బయటకు వచ్చేందుకే ఇబ్బందులు పడుతుంటే... పార్టీలో ఇప్పుడిప్పుడే కీలక నేతలుగా ఎదుగుతున్న నేతలు మాత్రం ఒక్కరొక్కరుగానే పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే సుజనా చౌదరి - సీఎం రమేశ్ వంటి కీలక నేతలు పార్టీని వీడగా ఇప్పుడు పార్టీలో ఓ స్టార్ గా ఎదుగుతున్న సాధినేని యామినీ శర్మ కూడా ఆ దిశగా సాగుతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయనే చెప్పాలి.తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఆ ఎన్నికలకు కాస్తంత ముందుగా పార్టీలో క్రియాశీలక నేతగా ఎదిగిన యామిని... టీడీపీ ప్రత్యర్థులకు చుక్కలు చూపారు. అసలు యామినీ మీడియా ముందుకు వచ్చారంటే.. అవతలి వారికి ముచ్చుమటలు పట్టాయంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబును మరీ ప్రత్యేకించి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ఈగ కూడా వాలకుండా చూసుకునే క్రమంతో యామినీ చాలా మంది శత్రువులనే కూడగట్టుకున్నారని చెప్పక తప్పదు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే సాధినేని... సోషల్ మీడియా వేదికగానే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. అదే సమయంలో ప్రత్యర్థుల చేతిలో ఆమె సోషల్ మీడియా వేదికగానే నానా మాటలూ పడ్డారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో చాలా త్వరగానే ఆమెకు టీడీపీ అధికార ప్రతినిధి పదవి కూడా దక్కింది.

అయితే ఆమె ఊహించిన ఫలితాలకు రివర్స్ రిజల్ట్స్ రావడంతో గత కొంత కాలంగా ఆమె అసలు కనిపించడమే మానేశారు. ఇలాంటి క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి కొందరు నేతలు ఫొటోలు దిగగా... అందులో సాధినేని కూడా కనిపించి కలకలమే రేపారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అసలు టీడీపీని వీడే ఉద్దేశ్యమే లేకుంటే సాధినేని... కన్నాతో కలిసి ఫొటో ఎందుకు దిగుతారన్నది అసలు సిసలు ప్రశ్నగా మారిపోయింది. అంతేకాకుండా పలువురు నేతలతో కలిసి సాధినేని... కన్నాతో కలిసి ఫొటో తీయించుకున్నారు. కన్నాతో భేటీ కోసం సాధినేని వెళ్లారని ఈ సందర్భంగానే ఆ ఫొటో బయటకు వచ్చిందన్నది పలువురు చెబుతున్న మాట. మొత్తంగా ఓటమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీని వదిలేసి బీజేపీలో చేరిపోయేందుకు సాధినేని రంగం సిద్ధం చేసుకున్నారన్న వాదనలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి.