Begin typing your search above and press return to search.

కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా యడ్డి..సిద్ధూ స్నేహం

By:  Tupaki Desk   |   28 Feb 2020 1:49 PM GMT
కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా యడ్డి..సిద్ధూ స్నేహం
X
కన్నడ రాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే.. నేరుగా అక్కడి రాజకీయాల్ని చెబితే అర్థం కాకపోవచ్చు. అక్కడి పరిస్థితిని మన రాజకీయాలతో పోలిక పెట్టి చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఆంధ్రా రాజకీయాలకు వెళదాం. జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు ఇద్దరూ స్నేహంగా ఉండే అవకాశం ఉందా? పోని..తెలంగాణలో కేసీఆర్.. ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మిత్రులుగా ఉండే ముచ్చట ఉంటుందా? అంటే.. నో అని చెప్పేస్తారు. దాదాపుగా.. ఏళ్లకు ఏళ్లుగా ఉప్పునిప్పుగా ఉన్న ఇద్దరు అగ్రనేతల మధ్య స్నేహం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రిగా యడియూరప్ప వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా సిద్ధ రామయ్య ఉన్నారు. ఆ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ వచ్చినట్లే వచ్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత రాకపోవటం. దీంతో.. కాంగ్రెస్.. జేడీయూల మధ్య మైత్రితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేకున్నా కుమారస్వామి ముఖ్యమంత్రి కావటం సిద్ధరామయ్యకు ఏ మాత్రం నచ్చలేదు.

అయినప్పటికీ.. అధిష్ఠానం రంగంలోకి దిగి.. హస్తిన నుంచి వచ్చిన ఆదేశాల్ని అమలుతో కుమారస్వామి సీఎం అయ్యారు. ఇదంతా నచ్చని సిద్దరామయ్య కామ్ గా ఉన్నట్లే ఉండటం.. ఆయన వర్గానికి చెందిన పలువురు తిరుగుబాటు బావుటా ఎగురవేసి.. బీజేపీలోకి జంప్ కావటం తెలిసిందే. కుమారస్వామి ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత లభించకపోవటం కూడా సిద్ధూకు సుతారం నచ్చలేదు. తెర వెనుక నడిచిన మంత్రాంగం కావొచ్చు.. ఇతర అంశాలు కావొచ్చు.. కుమారస్వామి ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న బీజేపీ.. మొత్తంగా తాను కోరుకున్నట్లే ప్రభుత్వాన్నిఏర్పాటు చేసింది.

సాధారణంగా చేతిలో ఉన్న అధికారం చేజారినప్పుడు బాధ ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు సిద్ధరామయ్య. తనకు నచ్చని కుమారస్వామి చేతి నుంచి పవర్ పోవటం.. తన రాజకీయ ప్రత్యర్థి యడ్డికి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావటాన్ని స్వాగతిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి వారిద్దరూ ఏకకాలంలో అంటే.. 1983లో ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలోకి (కర్ణాటకలో విధానసభ అనాలనుకోండి) అడుగు పెట్టారు.

మొదట్నించి ఇద్దరి మధ్య సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నప్పటికి కలిసింది లేదు. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు విపక్ష నేతగా ఉండటం అలవాటు. దాని స్థానే.. కుమారస్వామికి సీఎం పీఠం దక్కటం సిద్ధూకి ఇష్టం లేకుండా పోయినట్లుంది. ఇద్దరి ఉమ్మడి శత్రువుగా కుమారస్వామి మారినట్లుగా చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో మూడేళ్ల పాటు అధికారంలో కొనసాగే పరిస్థితి. ఇలాంటివేళ.. తన రాజకీయ ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టి.. మూడు చెరువులు తాగించే దానికి భిన్నంగా.. సీఎంకు ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య తీరుకు తగ్గట్లే యడ్డి సైతం.. విపక్ష నేతకు ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అదెంత అంటే.. సిద్ధూ ప్రాతినిధ్యం వహిస్తున్న బాదామి నియోజకవర్గానికి ఏకంగా రూ.600 కోట్లు విడుదల చేశారు. అంతేకాదు..సిద్ధరామయ్య ఏం అడిగినా యడ్డి కాదనటం లేదు. అంతేకాదు..అసెంబ్లీలో సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏదైనా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అధికార బీజేపీ సభ్యులు అడ్డు తగులుతుంటే.. ముఖ్యమంత్రి యడ్డి వారిని సముదాయిస్తూ ఉండటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు రోజుల క్రితం (ఫిబ్రవరి 27న) యడ్డి పుట్టినరోజు వేడుకులకు ఆయన కుమారుడు విజయేంద్ర ప్రత్యేకం గా వెళ్లి సిద్దూను ఆహ్వానించటం చూస్తే.. వారిద్దరి మధ్య ప్రస్తుతం ఎలాంటి అనుబంధం ఉందన్న విషయం ఇట్టే అర్థమై పోతుందంటారు. మొత్తానికి కుమార స్వామిని రాజకీయం గా అణగదొక్కేందుకు యడ్డి.. సిద్ధూల స్నేహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.