Begin typing your search above and press return to search.

షర్మిల పాదయాత్రలో వైవీ సుబ్బారెడ్డి.. ఇద్దరి మధ్య రహస్య మంతనాలు

By:  Tupaki Desk   |   24 Oct 2021 1:35 PM GMT
షర్మిల పాదయాత్రలో వైవీ సుబ్బారెడ్డి.. ఇద్దరి మధ్య రహస్య మంతనాలు
X
వైఎస్‌ఆర్‌టీపీపై జరిగినంత చర్చ మరే పార్టీపై జరుగలేదు. ఎందుకంటే ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కాబట్టి. సీఎం జగన్‌, షర్మిల మధ్య విభేదాల కారణంగానే వేరు కుంపటి పెట్టుకున్నారని, అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని.. ఇలా అనేక విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా తెలంగాణ ఎందుకు పార్టీని స్ధాపించారని ప్రశ్నించిన వారు ఉన్నారు. అనేక విమర్శలు, ఆరోపణల మధ్య షర్మిల పార్టీ స్థాపించి.. విమర్శకుల నోళ్లు మూయించారు. పార్టీ తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.. తెలంగాణలో పార్టీ అవసరం ఏమిటీ అనేక అనుమానాలకు ఆమె ధీటుగా జవాబిచ్చారు. పార్టీని స్థాపించిన తర్వాత ఆమె తన కార్యచరణకు పదును పెట్టారు. నిరుద్యోగ దీక్షల పేరుతో నిరహారదీక్షలు  చేశారు. ప్రస్తుతం ఆమె ఓ సుదీర్ఘ కార్యచరణకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20వ తేదీ నుంచి షర్మిల మహా పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల లక్ష్యంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

ఈ రోజు ఓ అతిథి పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఆ అతిథి ఎవరో కాదు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన స్వయాన జగన్, షర్మిలకు చిన్నాన్న అవుతారు. అంతకుమించి వైఎస్ కుటుంబానికి అత్యంత విశ్వసనీయుడు... ఆ కుటుంబానికి పెద్దదిక్కు. సుబ్బారెడ్డి, షర్మిలతో భేటీ కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్బారెడ్డి ఎందుకు వచ్చారు? ఆయన జగన్ దూతగా వచ్చారా? షర్మిలతో ఏం మంతానాలు జరిపారు? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామంలో షర్మిల బస చేసిన సమయంలో సుబ్బారెడ్డి కలిశారు. షర్మిలను కలుసుకోవడానికి వచ్చిన ఆయనను ఆ పార్టీ నాయకుడు కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. షర్మిల, సుబ్బారెడ్డి ఇద్దరూ సుమారు గంటపాటు మాట్లాడుకున్నారు. పాదయాత్రకు సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర కొనసాగుతున్న తీరును సుబ్బారెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రకు వస్తున స్పందనపై కూడా ఆయన ఆరా తీశారు. తాజా రాజకీయ పరిణామాలతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఏపీలో జరుగుతున్న రణరంగంపై షర్మిల ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది.. ఈ స్థితి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ఇలా అనేక అంశాలపై షర్మిల ఆరా తీసినట్లు చెబుతున్నారు. అయితే షర్మిల ఆరోగ్య పరిస్థితి, క్షేమ సమాచారం తెలుసుకోవడానికి జగన్, సుబ్బారెడ్డిని పంపారని ప్రచారం జరుగుతోంది. జగన్ దూతగా వచ్చి షర్మిలతో సంప్రదింపులు జరిపారనే మరో ప్రచారం ఊపందుకుంది. ఈ రోజు సాయంత్రం వైఎస్ విజయమ్మతో కూడా సుబ్బారెడ్డి భేటీ అవుతారని చెబుతున్నారు. పాదయాత్ర నుంచి నేరుగా ఆయన లోటస్ పాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న ఘటనలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, జగన్‌ ఇచ్చిన సమాచారంపై విజయమ్మతో సుబ్బారెడ్డి చర్చిస్తారని చెబుతున్నారు. ఇక్కడ చర్చించి అంశాలు.. విజయమ్మ తీసుకున్న నిర్ణయాలను సుబ్బారెడ్డికి జగన్ అందజేస్తారని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.