Begin typing your search above and press return to search.

బాబాయ్ కి సీటు కన్ ఫర్మ్... ?

By:  Tupaki Desk   |   17 Jan 2022 8:04 AM GMT
బాబాయ్ కి సీటు కన్ ఫర్మ్... ?
X
రాజకీయాల్లో చుట్టాలు, పక్కాలకు డిమాండ్ యమగా ఉంటుంది. వారికి కోరుకున్న చోట సీటు ఇవ్వాల్సిందే. లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. అలా వైసీపీలో కూడా అధినేత జగన్ కి ఒక బాబాయ్ ఉన్నారు. ఆయనే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఆయన వైసీపీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నారు. ఒక విధంగా వైసీపీకి మూల విరాట్ గా చెప్పాలి. అలాంటి వైవీ సుబ్బారెడ్డి 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ 2018లో రాజీనామాలు చేస్తే ఆయన కూడా తన పదవిని వదులుకున్నారు.

అయితే 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించినా కూడా ఆయనకు భంగపాటు ఎదురైంది. ఆయన ప్లేస్ లో మాగుంట శ్రీనివాసులురెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చింది. ఆయన టీడీపీ నుంచి జంప్ అయి వచ్చారు. ఆర్ధికంగా అన్ని రకాలుగా గట్టి కావడంతో ఆయనకే ప్రయారిటీ ఇచ్చి బాబాయ్ ని పక్కన పెట్టేశారు. దాంతో అలిగిన వైవీకి రాజ్యసభ సీటు నాడు హామీగా దక్కిందని చెబుతారు.

అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2020లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో ఏ ఒక్కటీ కూడా వైవీకి దక్కలేదు. దాంతో ఆయన మరింతగా నిరాశ చెందారు. అదే సమయంలో ఆయన్ని ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు. అలా రెండేళ్ల కాలం గడచింది. ఈసారి ఆయన ఎమ్మెల్సీ అయిన ఇచ్చి మంత్రిని చేస్తారని అనుకుంటే రెండవ మారు కూడా టీటీడీ చైర్మన్ పదవే ఇచ్చారు జగన్. దాంతో వైవీ చూపు మాత్రం రాజ్యసభ సీటు మీదనే అలా ఉండిపోయిందట.

తాజాగా చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తారని వచ్చిన ప్రచారాన్ని ఖండించిన వారిలో వైవీ కూడా ఉన్నారు. దానికి కారణం ఆయనకు రాజ్యసభ సీటు మీద మోజు ఉండడమే అంటున్నారు. అయితే ఈసారి కూడా వైవీ ఆశలు తీరేలా కనిపించడంలేదు అంటున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డికి కచ్చితంగా ఒక సీటు ఇవ్వాలి. అలా సామాజికవర్గం కోటా పూర్తి అవుతుంది.

దాంతో వైవీకి మరి ఎలా అంటే. 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఆయన్ని లోక్ సభకు పోటీ చేయిస్తారు అంటున్నారు. ఆ మేరకు ఒక హామీ అయితే వచ్చింది అంటున్నారు. సిట్టింగ్ ఎంపీ మాగుంట రాజకీయాల నుంచి రిటైర్ కావాలనుకుంటున్నారుట. తనకు బదులుగా తన రాజకీయ వారసుడిగా కుమారుడు రాఘవరెడ్డిని ఆయన పొలిటికల్ సీన్ లోకి తెస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు.

ఇక రాఘవరెడ్డికి ఏదో ఒక చోట టికెట్ కోసం మాగుంట ప్రయత్నాలు చేసుకుంటున్నారుట. దానికి వైసీపీ హై కమాండ్ కూడా ఒకే అనడంతో మాగుంట ఈసారి లోక్ సభ బరిలో ఉండరు అని అంటున్నరు. అలా వైవీకి మరోసారి పార్లమెంట్ కి పోటీ చేసే చాన్స్ అయితే ఉంది అంటున్నారు. ఇవన్నీ సరే కానీ రాజ్యసభ సీటు విషయం అంటే మాత్రం అది కుదిరేది లేదనే అనేస్తున్నారని టాక్. మొత్తానికి బాబాయ్ కి పెద్దల సభ ఆశ అలాగే ఉండిపోయింది అంటున్నారు.