Begin typing your search above and press return to search.

టీటీడీ భూముల విక్రయం పై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

By:  Tupaki Desk   |   25 May 2020 1:24 PM GMT
టీటీడీ భూముల విక్రయం పై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
X
తమిళనాడు, రిషికేష్‌ లలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి నిరర్థక ఆస్తులను విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిందనే వార్తలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా శ్రీవారి ఆస్తులు అమ్మడం సరికాదని టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడు, బీజేపీ రాజ్యసభ సభ్యులు రాకేష్ సిన్హా, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సహా పలువురు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, జనసేనలు దీనిపై నిలదీశాయి. ఆస్తుల విక్రయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఈ రోజు క్లారిటీ ఇచ్చారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో రాజకీయాలు వద్దని, భక్తులు సమర్పించే ప్రతి పైసాను తాము కాపాడుతున్నామని వైవీ చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా రాజీపడే ప్రసక్తి లేదన్నారు. టీటీడీ భూముల విక్రయంపై తాము కొత్తగా నిర్ణయం తీసుకోలేదని, 1970 నుండి 2014 వరకు నాటి ప్రభుత్వాలు కూడా విక్రయించాయని చెప్పారు.

2016లో టీటీడీ సబ్-కమిటీ భూములు అమ్మాలని నిర్ణయించిందని, నాటి నిర్ణయాన్ని సమీక్షించాలని తాము నిర్ణయించామని, ఆస్తులు విక్రయించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. అమ్మకం విషయాన్ని వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నిరర్థక ఆస్తులను ఎలా వేలం వేయాలనే అంశంపై టీటీడీ రెండు బృందాలను ఏర్పాటు చేసిందన్నారు.

నిందలు భరించడం తమకు కొత్తేమీ కాదని, తిరుమల కొండకు తాము సేవకులుగా వచ్చామన్నారు. అన్యాక్రాంతమయ్యే అవకాశమున్న భూములను టీటీడీ విక్రయించుకోవచ్చునని, ఈ విషయాన్ని గత టీడీపీ ప్రభుత్వం హయాంలోని పాలక మండలి నిర్ణయించిందన్నారు. అందుకే తమిళనాడులో అన్యాక్రాంతమయ్యే అవకాశమున్న భూములను గుర్తించి, వాటి విక్రయానికి గల అవకాశాలను పరిశీలించాలని గత బోర్డు సమావేశంలో చర్చించామన్నారు. చర్చించామే గానీ విక్రయంపై నిర్ణయం తీసుకోలేదన్నారు.