అపార్థాలు వద్దు - అడిగింది నేనే - వైవీ సుబ్బారెడ్డి

Wed Jul 17 2019 16:57:27 GMT+0530 (IST)

అమరావతిలో టీటీడీ ఛైర్మన్ క్యాంప్ ఆఫీసు ఏర్పాటుపై పలు అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అవకాశం దొరికితే చాలు అధికార పార్టీని తప్పపట్టడానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు నిజానిజాలు తెలుసుకోకుండా అబద్ధాలు ప్రచారం చేయడం తగదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విమర్శలపై తాజాగా ఆయన స్పందించారు.అమరావతిలో తాను కేవలం ఒక ఆఫీసు మాత్రమే అడిగాను అని అక్కడ ఛైర్మన్ క్యాంప్ ఆఫీసు గురించి తాను అడగలేదని వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఆఫీసు అడగడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని ఆయన వివరించారు. అమరావతిలో టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తిరుమల ఆలయాన్ని పోలిన ఆలయ నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసమే రాజధానిలో కార్యాలయం అడిగానని ఆయన తెలిపారు. తాను శ్రీవారి ప్రధాన సేవకుడిని అని - అవసరమైతే నా జేబులో డబ్బులు ఖర్చుపెడతా గాని ఒక్క రూపాయి కూడా స్వామి వారిది ముట్టను అని ఆయన వివరించారు. చరిత్రలో నిలిచిపోయే ఆలయాన్ని దగ్గరుండి పర్యవేక్షించడం కోసం ఇక్కడ ఒక చిన్న ఆఫీసును అడిగానని - అయితే - అధికారులు ఛైర్మన్ క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిర్ణయం అయి ఉంటుందని అన్నారు.

తప్పులు చేయకపోతే బతకలేని తండ్రీకొడుకులు చంద్రబాబు - లోకేష్ లాగా మేము బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి రాజకీయాల్లోకి రాలేదని - ప్రత్యక్ష రాజకీయాల్లో పోరాడి గెలిచాం. నిక్కచ్చిగా ఉంటాం అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఆఫీసు ఎందుకు అడిగానో తెలుసుకోకుండా అబద్ధాల ప్రచారం చేయడం ప్రతిపక్షానికి తగదని అన్నారు.