వైసీపీ నేతలకు ఫ్లీనరీ ఫీవర్!

Sat Jul 02 2022 05:00:02 GMT+0530 (IST)

YSRCP leaders Over Pleenary

ప్లీనరీలలో వివాదాలే కేంద్ర బిందువు అవుతున్నాయి. అసలు పార్టీలో ఏం జరుగుతుంది అన్న ఆందోళన పూర్వక వాతావరణం ఒకటి నెలకొని ఉంది అనేందుకు  ప్లీనరీలే సాక్షి. నేతలకు వాస్తవాలను ఇవి కళ్లకు కడుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పలాస ప్లీనరీ ఓ విధంగా వివాదానికి కారణం అయింది. మొన్నటి నర్సన్నపేట ప్లీనరీ కూడా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ ప్లీనరీలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు ఆగ్రహంతో ఊగిపోయి తనను ఎవరు ఓడించలేరని తగ్గేదేలే అని సినిమా డైలాగులు కొట్టి కొత్త గా ఇక్కడ పోటీ చేసేందుకు ఆశపడుతున్న అభ్యర్థులకు ఝలక్ ఇచ్చారు.  తరువాత సీఎం సభ రానే వచ్చింది. అక్కడ కూడా దాసన్న వైఫల్యాలే కనిపించాయి అని తెలుస్తోంది. ఆయన సాక్షిగా చోటామోటాలకు సీఎం కరచాలనం దక్కినా సాక్షాత్తూ ఓ మాజీ కేంద్ర మంత్రికి మాత్రం సముచిత స్థానం దక్కలేదు.

ఇదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో నాయకులకు వరుస అవమానాలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ కారణం నాయకుల మధ్య సమన్వయ లోపమే ! ఇటీవల సీఎం పర్యటనలో తలెత్తిన వివాదం తో కిల్లి కృపారాణి (కేంద్ర మాజీ మంత్రి) అవమానపడిన విషయం విధితమే.

సొంత పార్టీ నాయకులే తనను అడ్డుకుంటున్నారని మండిపడుతూ వెళ్లిపోయారు. ఈ సభకు చిన్నచిన్ననాయకులు వచ్చి హడావుడి చేశారు. కానీ సీనియర్ నాయకులకు పెద్దగా ప్రాధాన్యం లేదు..అని తేలిపోయింది. దీంతో ప్రొటొకాల్ వివాదం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఈ సభ లో కూడా చిన్న చిన్న నాయకుల సందడి కూడా బాగానే ఉంది.

ప్రొటొకాల్ వివాదంపై దాసన్న స్పందించి కృపారాణికి సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. తాజాగా పలాసలోనూ ఇదే విధంగా ప్రొటొకాల్ వివాదం రేగింది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబును వేదికపైకి పిలవకుండా ప్లీనరీలో అవమానపరిచారు. దీంతో అతిథులను మాత్రమే వేదికపైకి పిలిచామని చెప్పి సభా నిర్వహణ చేస్తున్న వారు ఆయనకు సర్దిచెప్పినా వినిపించుకోకుం  డానే వెళ్లిపోయారు.

మీ నాయకులకో నమస్కారం అంటూ ప్లీనరీని బహిష్కరించారు. తన అనుచరులతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ప్లీనరీ వేడుకకు కూడా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన నేతృత్వంలోనే ఈ విధంగా నాయకులకు వరుస అవమానాలు జరుగుతున్నాయి. ఆఖరికి బళ్ల గిరిబాబు తనకు పదవులేవీ అక్కర్లేదని అవసరం అయితే రాజీనామా చేస్తానని అన్నారు. పలాస కేంద్రంగా మంత్రి సీదిరి అప్పల్రాజు  రాజకీయం నడుపుతున్నారు. ఆయన వర్గంకు చెందిన వ్యక్తిగానే బళ్ల గిరిబాబుకు పేరుఉంది.  అయినప్పటికీ  ఎందుకనో పలాస ప్లీనరీలో ఆయన్ను అవమానించారు.