ఆ ఊసే మరచిన పవన్...వైసీపీకి బంగారు పళ్ళెంలో అధికారం...?

Mon Nov 28 2022 15:00:43 GMT+0530 (India Standard Time)

YSRCP gets power on a golden plate?

పవన్ కళ్యాణ్ మాటలలో పులిలా కనిపిస్తారు. చేతలలో మాత్రం ఆయన అనుకున్నంత దూకుడు చూపించడం లేదు అని అంటున్నారు. అదే విధంగా పవన్ నిన్న అన్న మాట నేడు మరచిపోతున్నారు అని విపక్ష శిబిరం అంటోంది. ఏపీలో వైసీపీ లేని రాజకీయాన్ని చూస్తామని దాన్ని తాను తీసుకొస్తాను అని పవన్ మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించారు.ఆ మీదట ఆయన వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలికను జరగనివ్వమని ఖండితంగా చెప్పుకొచ్చారు. కానీ ఆచరణంలో మాత్రం అడుగు ముందుకు పడడంలేదు. మరో వైపు చూస్తే విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ భేటీ వేసిన తరువాత ఆయన టోన్ పూర్తిగా మారిపోయింది. విజయనగరం టూర్ లోనూ తాజాగా జరిగిన మంగళగిరి పార్టీ మీటింగులోనూ ఆయన జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది అన్న అర్ధం వచ్చే విధంగానే మాట్లాడుతున్నారు.

ఈ సారి ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయాలని ఆయన కోరుతున్న తీరు కానీ జనసేన కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని బల్లగుద్ది చెబుతున్న సీన్ కానీ చూస్తే పవన్ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అర్ధమవుతోంది. ఏపీలో విపక్ష వ్యతిరక ఓట్లు చీలకూడదు అంటే టీడీపీ బీజేపీ జనసేన పొత్తులు పెట్టులు పెట్టుకోవాలి. అంటే అది 2014 రాజకీయాన్ని రిపీట్ చేసినట్లుగా అవుతుంది.

ఒకవేళ బీజేపీ టీడీపీ కలవదు అనుకుంటే కమ్యూనిస్టులలతో కలసి టీడీపీని చేర్చుకుని అయినా కూటమిని ఏర్పాటు చేసుకోవాలి. కానీ అవేమీ లేకుండా వైసీపీని ఓడిస్తామంటే జరిగే పనేనా అన్న చర్చ అయితే ఉంది. ఎందుకంటే వైసీపీ పట్ల ఏపీ జనాలలో ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ప్రతిపక్షాలు తలో వైపు నుంచి పోటీ చేసి ఓట్లు చీల్చింతే కచ్చితంగా మరోసారి వైసీపీయే అధికారంలోకి వస్తుంది.

ఈ మాట చెప్పడానికి ఏపీలో ఏ సర్వే కూడా అవసరం లేదు. మరి ఏపీలో వైసీపీని గద్దె దించుతాను అని పవన్ ఒకటికి పదిసార్లు చెబుతున్నారు కానీ ఆ దిశగా ఆయన ప్రయత్నాలు ఉంటున్నాయా అంటే లేవు అన్న జవాబు వస్తుంది. ఆ మధ్యన విజయవాడలో చంద్రబాబు పవన్ కలిశారు. ఈ ఇద్దరి భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కలసి పోరాడుతామని చెప్పారు.

కానీ ఆ తరువాత ఇక అంగుళం కూడా ఆ వైపుగా అడుగులు పడలేదు. అదే టైం లో పవన్ కల్యాణ్ సోలో వాయిస్ వినిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల అనంతరం జనసేన అధికారంలోకి వస్తుందని తామే వైసీపీ నేతల భరతం పడతామని ఆయన బిగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే జనసేన ఎలా అధికారంలోకి వస్తుంది అంటే కచ్చితంగా ఒంటరి పోరుకి సిద్ధం కావడం వల్లనే అని కూడా చెప్పుకోవాలి.

మరి జనసేన మానాన ఆ పార్టీ ఒంటరి పోరుకు దిగితే తెలుగుదేశం వేరేగా పోటీ చేస్తే అధికారంలోకి మళ్లీ వచ్చేది వైసీపీయే కదా. మరి ఈ సింపుల్ లాజిక్ పవన్ మిస్ అవుతున్నారా లేక ఎవరూ లేకుండా తామే సొంతంగా అధికారంలోకి వస్తామన్న అంచనాలూ సర్వే నివేదికలు ఆయన వద్ద ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక మరో విషయాన్ని గమనిస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడా టీడీపీ ఊసు కానీ చంద్రబాబు ప్రస్తావన కానీ తేవడంలేదు అంటున్నారు.

అదే చంద్రబాబును తీసుకుంటే ఆయన తన సభలలో పవన్ గురించి ఏదో ఒక చోట మాట్లాడుతున్నారు. మరి పవన్ మదిలో ఆలోచనలు ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు అని అంటున్నారు. నిజంగా ఏపీలో వైసీపీని దించాలనుకుంటే విపక్షాల ఓట్లు చీలకుండా ఒక కార్యాచరణ రూపొంచుకుని పవన్ పని చేయాల్సి ఉందని కానీ ఆయన జనసేనకే అధికారం ఇవ్వండి అని కోరడాన్ని బట్టి చూస్తే ఏపీలో బహుముఖ పోటీలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు. దాంతో బంగారు పళ్లెంలో మరోమారు అధికారం వైసీపీకే దక్కుతుంది అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ పరోక్షంగా వైసీపీకే మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారా అని విపక్ష శిబిరం ఆలోచిస్తే అందులో తప్పేముంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.