ఎన్టీయార్ కి భారతరత్న... స్కెచ్ మామూలుగా లేదుగా...?

Mon Sep 26 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

YSRCP Planning on Bharatratna For Senior NTR

తెలుగు వారికి ఆరాధ్య నాయకుడు నందమూరి తారక రామారావు. ఆపయన తెలుగు వారి గుండెల్లో కొలువుండే నేత. అలాంటి ఎన్టీయార్ విషయంలో ఇపుడు ఏపీలో రాజకీయ రచ్చ సాగుతోంది. ఎన్టీయార్ పేరుని హెల్త్ వర్శిటీకి తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడంతో మొదలైన ఈ వివాదం రాజుకుంది. ఎన్టీయార్ పేరు ఎలా తొలగిస్తారు అంటూ టీడీపీ నానాయాగీ చేస్తున్నా వైసీపీ ఏ మాత్రం తగ్గడంలేదు. పైగా మీకు ఆ నైతిక హక్కు లేదంటూ పాత వెన్ను పోటు ఎపిసోడ్  తెరమీదకు తేవడం ద్వారా టీడీపీకి కాస్తా గట్టిగానే  షాక్ ఇస్తోంది.ఇవన్నీ పక్కన పెడితే ఎంత కాదన్న ఎన్టీయార్ విషయంలో వైసీపీ చేసింది తప్పే అన్న భావన అయితే తటస్థ జనాలలో ఉంది. ఎన్టీయార్ పేరుని ఎత్తే హక్కు టీడీపీకి  నైతికంగా లేకపోవచ్చు కానీ జనాలకు మాత్రం కచ్చితంగా ఉంది. వారు ఇది తప్పు అనే అంటున్నారు. వారికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం అయితే వైసీపీ పెద్దలకు ఉంది.

రాజకీయంగా రివర్స్ అటాక్ చేసి టీడీపీ నోరు మూయించాలనుకున్నా ఎన్టీయార్ ఆ పార్టీ మనిషి మాత్రమే కాదు రాజకీయాలకు అతీతమైన ఇమేజ్ ఆయనది. అందువల్ల దీని వల్ల వైసీపీకి బిగ్ ట్రబుల్ తప్పదనే అంటున్నారు. దాంతో హెల్త్ వర్శిటీ విషయంలో వైసీపీ వెనక్కి తగ్గేది ఉండదు. ఇపుడు  తగ్గితే సొంత తండ్రిని అవమానపరచారు అన్న భారీ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తొంది.

దాంతో ఇపుడు వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీయార్ కి భారతరత్న ఇవ్వమని కేంద్రాన్ని వైసీపీ కోరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఎన్టీయార్ ఆ అత్యున్నత పురస్కారానికి అర్హుడే.  ఇవ్వడానికి కేంద్ర పెద్దలు ఏనాడో సుముఖత వ్యక్తం చేసినా టీడీపీ పెద్దల ఫ్యామిలీ పాలిటిక్స్ వల్ల అది సాధ్యపడలేదు. ఎన్టీయార్ కి భారతరత్న ఇస్తే తీసుకునేది ఆయన రెండవ భార్య లక్ష్మీ పార్వతి కాబట్టే  అలా చేశారని చెబుతారు.

ఇక ఇపుడు చూస్తే  లక్ష్మీ పార్వతి వైసీపీలోనే ఉన్నారు. ఒకవేళ భారతరత్న ఇచ్చినా ఆమె హ్యాపీగా ఇపుడు  తీసుకుంటారు. అలా వైసీపీకే మైలేజ్ వస్తుంది.  ఇక ఎన్టీయార్  అంటే జగన్ కి ప్రత్యేక అభిమానం ఉంది. అదే విధంగా చూసుకుంటే కేంద్రంలోని బీజేపీకి కూడా ఎన్టీయార్ అంటే అభిమానం ఉంది. వారు కూడా ఏపీలో తాము రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీయార్ కి భారతరత్న ఇచ్చే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో ఎన్టీయార్ పేరుని హెల్త్ వర్శిటీకి తొలగించారు అని ఎగిరెగిరి పడుతున్న బీజేపీ పెద్దలు కూడా భారతరత్న ఆయనకు ఇవ్వాలంటే ఏమీ చేయలేక సమర్ధించాల్సి ఉంటుంది. ఇలా రాజకీయంగా కూడా కమలం వారికి చెక్ చెప్పవచ్చు. అలాగే టీడీపీని ఇరుకునపెట్టడానికి ఎన్టీయార్ అసంఖ్యాకమైన ఫ్యాన్స్ ని శాటిస్ ఫై చేయడానికి అన్న గారికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ని వైసీపీ తొందరలో తెర మీదకు తేనుంది అని అంటున్నారు.

ఎన్టీయార్ కి భారతరత్న ఇస్తే కచ్చితంగా కృషి చేసిన వైసీపీ శాశ్వతంగా ఎన్టీయార్ పేరును చెప్పుకుని జనంలోకి వెళ్ళడానికి  వీలు ఉంటుంది. అలాగే టీడీపీ నుంచి కూడా ఆయన పేరుని దూరం చేసినట్లు అవుతుంది. ఒకవేళ భారతరత్న కేంద్రం ఏ కారణం చేత అయినా ఇవ్వకపోతే ఆ తప్పు కేంద్రంలోని బీజేపీ మీద ఏపీలో ఎన్టీయార్ మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్న బీజేపీ వారి మీదకే పోతుంది. ఇలా అనేక విధాలుగా కలసివచ్చేలా భారతరత్న అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఈ విషయంలో కనుక వైసీపీ సక్సెస్ అయితే జగన్ పేరు కూడా ఎన్టీయార్ ఫ్యాన్స్ చిరకాలం చెప్పుకుంటారనే అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఎంతవరకూ నిజమవుతుందో.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.