Begin typing your search above and press return to search.

మోడీ పిలుపుతో జగన్ పార్టీ ఎంపీ రేంజ్ ఎంత మారిందంటే?

By:  Tupaki Desk   |   21 Nov 2019 10:59 AM GMT
మోడీ పిలుపుతో జగన్ పార్టీ ఎంపీ రేంజ్ ఎంత మారిందంటే?
X
ఒకే ఒక్క సీన్ తో కొందరు హాట్ టాపిక్ గా మారుతుంటారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆశ్చర్యంతో అవాక్కు కావటమే కాదు.. ఇది నిజమా? అని షాక్ తిన్న పరిస్థితి. పార్లమెంటు సెంట్రల్ హాల్లో చోటు చేసుకున్న ఈ వైనం చూస్తే.. ఇలాంటి మేజిక్కులు ప్రధాని మోడీ మాత్రమే చేయగలరన్న భావన కలగక మానదు.

ఇంతకూ జరిగిందేమంటే.. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రధాని మోడీ వెళుతున్నారు. ఆయన వెళుతున్న సమయంలోనే నరసాపురం ఎంపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు కనిపించారు. వెంటనే వినయంతో నమస్తే సార్ అంటూ పలుకరించారు. మామూలుగా ప్రధాని మోడీకి ఇలాంటివి అలవాటే. కాకుంటే.. ఈసారి సీన్ కాస్త మారింది.

కమాండోల మధ్య నడుచుకుంటూ వెళుతున్న ప్రధాని మోడీ స్పందించి ఆయన్ను తన వద్దకు రావాలని పిలిచారు. ఇలాంటి స్పందనను ఏ మాత్రం ఊహించని రఘురామకృష్ణంరాజు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆయన వద్దకు వెళ్లారు. ప్రధాని వద్దకు వినయంగా వెళ్లి నమస్కరించారు. దీంతో ప్రధాని.. రాజుగారు అంటూ పిలవటమే కాదు కరచాలనం చేశారు. నవ్వుతూ భుజం తట్టారు.

అనంతరం మోడీ రాజ్యసభ నుంచి తన ఛాంబర్ కు వెళ్లిపోయారు. ఇదంతా జరిగిన సమయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వెంట జగన్ పార్టీ ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఆదాల ప్రభాకర్ రెడ్డి.. ఇతర ఎంపీలు ఉన్నారు. వారంతా జరిగిన దానిని ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. ఈ పరిణామంతో ఎంపీ రఘురామకృష్ణంరాజు రేంజ్ పెరిగిపోవటమే కాదు.. ప్రధాని మోడీ స్వయంగా గుర్తించి పలుకరించేంత ఉందా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరో కీలక అంశం ఏమంటే.. రెండు.. మూడు రోజుల క్రితం ప్రధాని.. కేంద్రమంత్రుల వద్దకు విజయసాయి రెడ్డి తో తప్పించి విడిగా వెళ్లకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఈ ఘటన చోటు చేసుకోవటం చూస్తే.. ప్రధాని మోడీకి ఈ సమాచారం అంది ఇలా వ్యవహరించారా? అన్నది సందేహంగా మారింది. రానున్న రోజుల్లో ఇలాంటివే మరిన్ని చోటు చేసుకుంటే మాత్రం ఆ వాదనలో వాస్తవం ఉందన్న భావన కలగటం ఖాయం.