ఎంపీ మాగుంటకు వైసీపీ నేతల షాక్.. ఇక వదిలేసినట్టేనా?

Sun Jun 26 2022 21:39:21 GMT+0530 (IST)

YSRCP MP Magunta Srinivasulu Reddy

సీనియర్ రాజకీయ నాయకుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సొంత పార్టీ వైసీపీలోనే ఘోర అవమానం జరిగింది. ఆయనను అధికారులు సహా నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా.. ఆయన పాల్గొనే కార్యక్రమాలకు కూడా ఎవరూ హాజరు కావడం లేదు... అంతేకాదు.. ఎవరినీ రానివ్వడమూ లేదు. దీంతో ఎంపీ మాగుంట తీవ్ర అవమానానికి గురవుతున్నా రని .. ఆయన వర్గం చెబుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన మాగుంట.. తర్వాత.. కాలంలో పార్టీలో నాయకులకు దూరమయ్యారనే వాదన ఉంది. ఇక ఇప్పుడు ఈ వివాదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తోంది.తాజాగా ఏం జరిగిందంటే..

తాజాగా ఎంపీ మాగుంట.. తన నియోజకవర్గం పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులను ప్రతినిధులను రావాలని కోరారు. కానీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎంపీ కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు చేసి పిలిచిన తర్వాత..  ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఒకరిని పంపించి చేతులు దులుపుకొన్నారు. దీంతో ఎంపీ నిర్వహించిన సభలో ఎవరూ లేక పోవడం.. ఎవరూ రాకపోవడం.. చర్చకు దారితీసింది.

ఒంగోలు లోని అగ్రహారం పాకల టంగుటూరు సూరారెడ్డిపాలెం రైల్వేగేట్ల వద్ద ట్రాఫిక్ ప్రతిరోజు సమస్యగా మారింది. ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు ఎంపీ రైల్వే ఆర్ అండ్ బీ మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గుంటూరు విజయవాడ రైల్వే డివిజన్లకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు. కానీ ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు.

ఎవరు వచ్చారంటే..

ఎంపీ మాగుంట నిర్వహించిన ఈ సమావేశానికి  ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చెత్తను సేకరించే ఉద్యోగులపై ఇన్ ఛార్జిగా ఉన్న డి.బ్రహ్మయ్య(ఈయన రిటైర్ అయ్యారు) అనే ఉద్యోగి వచ్చారు. దీనిపై ఎంపీ మాగుంట తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మూడురోజుల క్రితమే సమాచారం ఇచ్చినప్పటికీ ఇలా ఎందుకు వ్యవహరించారని ఆయన నిలదీశారు. అధికారుల నుంచి సహకారం కొరవడుతోందని ఎంపీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కనీసం ప్రొటోకాల్ ప్రకారం కూడా కొన్ని కార్యక్రమాలకు ఎంపీకి సమాచారం ఇవ్వడంలేదని మాగుంట అనుచరులు ఆరోపిస్తున్నారు.

ఎందుకు ఇలా జరిగింది?

వైసీపీలో మాగుంట ఒంటరయ్యారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. గత ఎన్నికలకు ముందు వరకు కూడా ఆయన టీడీపీలో ఉన్నారు. ఇప్పటికీ టీడీపీ వారితో సంబంధాలు నెరుపుతున్నారు. కొన్నాళ్ల కిందట పార్లమెంటులో సమావేశాల సందర్భంగా తన నివాసంలో టీడీపీ ఎంపీలకు విందు ఇచ్చారు. ఈ పరిణామాలతో అధిష్టానం కూడా ఆయనను దూరం పెట్టిందనే టాక్ ఉంది. ఇటీవల ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పాల్గొన్న కార్యక్రమానికి కూడా మాగుంటకు ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన కూడా రాలేదు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో మాగుంట.. టీడీపీ తరఫున పోటీ చేస్తారనే టాక్ కూడా కొన్నాళ్లుగా వినిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే మాగుంటను పక్కన పెట్టేశారని అంటున్నారు పరిశీలకులు.