Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ అనంతబాబుకు షాకిచ్చిన వైసీపీ.. సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   25 May 2022 2:58 PM GMT
ఎమ్మెల్సీ అనంతబాబుకు షాకిచ్చిన వైసీపీ.. సంచలన నిర్ణయం
X
రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. వర్ సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుపై సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలోనే అధికార వైసీపీ ప్రభుత్వం దీనిపై సీరియస్ గా ముందుకెళుతోంది. తాజాగా అనంతబాబుకు బిగ్ షాక్ ఇచ్చింది.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది.. అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో దీనిపై పోలీసులు, ప్రభుత్వం అలెర్ట్ అయ్యారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన పోలీసులు ఈ కేసును ఛేదించినట్టు తెలిసింది.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్నట్టుగా మీడియాలో ప్రచారం సాగుతోంది.తానే హత్య చేశానని.. ఇందులో ఎవరి ప్రమేయం లేదని.. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేశానని వైసీపీ ఎమ్మెల్సీ పోలీసుల విచారణలో అంగీకరించినట్టుగా వార్తలొచ్చాయి. తన వ్యక్తిగత విషయాలు అందరికీ చెబుతానని బ్లాక్ మెయిల్ చేశాడని.. కొట్టి బెదిరిద్దామనుకున్నానని.. కానీ ఆ క్రమంలో ఇలా జరిగిందని పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ నిజం ఒప్పుకున్నట్టుగా ప్రచారం సాగింది.

తీవ్ర దుమారం రేపిన ఈ వ్యవహారంలో వైసీపీ అధిష్టానం సైతం సీరియస్ గా స్పందించింది. ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఒక ప్రకటన జారీ చేసింది. హత్యా రాజకీయాలకు తాము లేదని చెబుతూ.. అనంతబాబు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి అనంతబాబును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.

-సుబ్రహ్మణ్యం హత్య అసలు ఎలా జరిగింది?
ఈనెల 19న ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్య బయటకు వెళ్లి శ్రీరామ్ నగర్ లోని తన మిత్రులతో కలిసి మద్యం సేవించాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కారులో తీసుకెళ్లాడు. అర్థరాత్రి డ్రైవర్ డెడ్ బాడీని అతడి ఇంటివద్దకు ఎమ్మెల్సీ తన కారులోనే తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఏం జరిగిందన్నది పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. సుబ్రహ్మణ్యం పెళ్లి సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు కొంత డబ్బులు ఇచ్చాడని సమాచారం. తీసుకున్న డబ్బులు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతబాబు గుట్టు బయటపెడుతానని డ్రైవర్ సుబ్రహ్మణ్యం బెదిరింపులకు దిగి బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం ను ఎమ్మెల్సీ అనంతబాబు మందలించాడు. పద్ధతి మార్చుకోవాలన్నాడు.కానీ డ్రైవర్ తిరగబడ్డాడు. వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో ఎమ్మెల్సీ గట్టిగా డ్రైవర్ ను వెనక్కి నెట్టాడు. ఈ క్రమంలోనే డ్రైవర్ తలకు గాయమైంది. లేచిన సుబ్రహ్మణ్యం ఆవేశంతో అనంతబాబు మీదకు వచ్చాడు. మరోసారి వెనక్కి నెట్టడంతో గ్రిల్ కు తగిలి సుబ్రహ్మణ్యం తల నుంచి రక్తం కారడం మొదలైంది.గాయపడిన సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలోనే డ్రైవర్ చనిపోవడంతో అనంతబాబు షాక్ అయ్యాడు.

గతంలో మద్యం తాగి యాక్సిడెంట్ చేసిన సుబ్రహ్మణ్యం ఇష్యూలను బేస్ చేసుకొని ఎమ్మెల్సీ ఈ హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూశాడు. ప్రమాదంలా ఉండాలని సుబ్రహ్మణ్యం శరీరంపై కర్రతో కొట్టాడు. చనిపోయాక కూడా కర్రతో దాడి చేశాడు. దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు.