Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ అడ్డా జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఏం సాధించ‌లేదా.!

By:  Tupaki Desk   |   1 Dec 2021 4:30 PM GMT
జ‌గ‌న్ అడ్డా జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఏం సాధించ‌లేదా.!
X
జ‌గ‌న్‌కు రాజ‌కీయ స్థానం ఇచ్చిన జిల్లాలు ఆరే. ఆయ‌న పార్టీని ముందు నుంచి నిల‌బెడుతూ వ‌స్తోన్న జిల్లాల్లో సీమ‌లోని నాలుగు జిల్లాల‌తో పాటు నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాలు. ఈ నాలుగు జిల్లాల్లో వైసీపీ 2014లో కూడా టీడీపీ కంటే ఎక్కువ స్థానాలే గెలుచుకుంది. అంతెందుకు 2014లో ఒక్క అనంత‌పురం మిన‌హా అన్ని జిల్లాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ వైసీపీ ఆధిప‌త్య‌మే చాటుకుంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో అయితే ఈ ఆరు జిల్లాల్లో క‌లిపి టీడీపీ ఒక్క ఎంపీ సీటు గెల‌వ‌లేదు. ఇక 7 ఎమ్మెల్యే సీట్లు మాత్ర‌మే గెలిచింది. ఇందులో ప్ర‌కాశం జిల్లాలోనివే నాలుగు ఉన్నాయి.

మ‌రి జ‌గ‌న్‌ను అంత‌లా నిల‌బెట్టిన ఈ ఆరు కంచుకోట‌లు అయిన జిల్లాల్లో ఇప్పుడు అధికార వైసీపీ ఎమ్మెల్యే ప‌రిస్థితి ఎలా ఉంద‌ని ప్ర‌శ్నించుకుంటే వారు త‌మ బాధ‌లు పైకి చెప్పుకోలేరు.. లోప‌ల అణ‌చుకోలేరు అన్న‌ట్టుగా ఉంది. ఇటీవ‌ల ఓ నేష‌న‌ల్ స‌ర్వే సంస్థ చేసిన స‌ర్వేలో ఈ ఆరు జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో జ‌నాల మ‌ధ్య‌కు వెళ్లే ప‌రిస్థితి లేద‌ట‌. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ లేకుండా చేసిన ఈ జిల్లాల్లో ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింద‌ట‌.

జ‌గ‌న్‌ను ఎలాగైనా సీఎం చేసుకోవాలి.. ఆయ‌న‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని ఈ జిల్లా జ‌నాలు క‌సితో ఓట్లేసి ఫ్యాన్‌కు ప‌ట్టం క‌ట్టారు. అయితే ఈ ఆరు జిల్లాల ఎమ్మెల్యేల్లో ఎవ‌రో ఒకరిద్ద‌రు మిన‌హా 90 శాతం మంది చెన్నైలోనో లేదా హైద‌రాబాద్‌, బెంగ‌ళూరులో కాలం గ‌డుపుతున్నారు అట‌. ఎవ్వ‌రూ కూడా నియోజ‌క‌వ‌ర్గాల్లోకి , ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేద‌ని తెలుస్తోంది. నెల్లూరు ఎమ్మెల్యేలు చెన్నైలోనే మ‌కాం ఉంటున్నారు.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఓ రియ‌ల్ట‌ర్ ఎమ్మెల్యే, మ‌రో విద్యావేత్త అయిన ఎమ్మెల్యే బెంగ‌ళూరులోనే ఉంటారు. ఇక ముగ్గురు మంత్రులు హైద‌రాబాద్‌కే ప‌రిమితం. పోని త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌లు సీఎంకు చెప్పుకుందామంటే అక్క‌డ అపాయింట్‌మెంట్లు లేవంటున్నార‌ట‌. కేవ‌లం న‌వ‌ర‌త్నాలే మ‌మ్మ‌ల‌ను మ‌రోసారి గెలిపించేస్తాయ‌ని ఈ ఎమ్మెల్యేలు స‌ర్ది చెప్పుకుంటున్నార‌ట‌.

ఇక ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అన్ని నేరుగా జ‌నాల ద‌గ్గ‌ర‌కే వారి అక్కౌంట్లలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో ఎమ్మెల్యేల‌కు ప‌ని లేకుండా పోయింది. పైగా ఇటీవ‌ల అనేక కార‌ణాల‌తో చాలా మంది పెన్ష‌న్లు కూడా తీసేశారు. దీంతో అస‌లు వారు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డ‌మే మానేశారు. ఈ కార‌ణాల‌తోనే వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే ప‌రిస్థితి లేద‌ని టాక్ ? ఇప్ప‌ట‌కి అయినా ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌క‌పోతే వారికి వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత శంక‌ర‌గిరి మాన్యాలే గ‌తి..!