ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసే వారికి వణుకు పుట్టాలి: రోజా

Fri Dec 06 2019 21:54:59 GMT+0530 (IST)

YSRCP MLA Roja Comments On about Disha murder Accused Encounter

ఆడపిల్లలపై అఘాయిత్యాలపై నమోదయ్యే కేసులు చాలా తక్కువని.. కేసుల వరకు వెళ్లని ఘటనలు ఎన్నో ఉంటున్నాయని.. ఆడదాన్ని ఒక వస్తువుగా చూడడం కరెక్ట్ కాదని ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ రోజా అన్నారు. దిశ అత్యాచారం కేసులో నిందితులు పోలీస్ ఎన్ కౌంటర్ లో మరణించడంపై ఆమె స్పందించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులు ఎన్ కౌంటర్ లో హతమవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆ నలుగురి ఎన్ కౌంటర్ పై దేశంలో హర్షం వ్యక్తమవుతోందని.. ప్రజలు మద్దతిస్తున్నారని అన్నారు.ఈ కేసులో నిందితులను విచారణలో భాగంగా సంఘటన స్థలానికి తీసుకెళ్లిన సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఎన్కౌంటర్ జరిగిందని రోజా అన్నారు. దిశను కిరాతకంగా చంపేసిన నిందితులు.. సంఘటన స్థలానికి వెళ్లాక తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. దీంతో పోలీసు ఎన్ కౌంటర్ లో హతమయ్యారని రోజా వ్యాఖ్యానించారు. సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు.  మహిళలను అసభ్యకరంగా తాకినా - మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా కఠిన శిక్షలు పడతాయన్న భయంతో వణుకుపుట్టేలా చట్టాలు ఉండాలన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడినా రాజకీయ ప్రోద్బలంతో.. పోలీసుల అండతో బయటికి రావచ్చనుకుంటున్న వారికి ఈ ఘటన కనువిప్పని అన్నారు.

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచార కేసు నిందితులు ఈ రోజు ఉదయం ఎన్ కౌంటర్ లో హతమైన సంగతి తెలిసిందే. గత నెల 27న దిశపై అత్యాచారం.. హత్య ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించేందుకు సైబరాబాద్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హత్యాచార ఘటన రీకన్ స్ట్రక్షన్ చేసేందుకు నిందితులను సంఘటన స్థలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారని.. ఆక్రమంలో పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలు తీసుకుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశారని.. పోలీసులు ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు జరపడంతో నిందితులు నలుగురూ చనిపోయారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.