తన ఆస్తులపై పుష్పశ్రీవాణి సవాల్ ఇదే!

Sun Jul 03 2022 20:46:22 GMT+0530 (IST)

YSRCP MLA Pushpa Srivani

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కురుపాం నుంచి 2014 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు.. పాముల పుష్పశ్రీవాణి. రాజకీయాల్లోకి రాకముందు బీఈడీ పూర్తిచేసి టీచర్ గా పనిచేస్తున్న పుష్పశ్రీవాణిని పరీక్షితు రాజు పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆమె రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న శత్రుచర్ల కుటుంబ కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయించాలని పుష్పశ్రీవాణిని కోరినప్పటికీ ఆమె ఆ పనిచేయలేదు. దీంతో 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆమెను డిప్యూటీ సీఎంగా తన కేబినెట్ లోకి తీసుకున్నారు.. ముఖ్యమంత్రి జగన్. ఆమెకు గిరిజన సంక్షేమ బాధ్యతలు అప్పగించారు. మూడేళ్లపాటు ఆమె ఈ పదవిలో ఉన్నారు. మరోవైపు ఆమె భర్త పరీక్షిత్ రాజు అరకు పార్లమెంటరీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.

కాగా జగన్ రెండోసారి మంత్రివర్గ విస్తరణలో పుష్పశ్రీవాణి మంత్రిపదవి పోయింది. ఆమెను పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు. ప్రస్తుతం పార్టీ నిర్వహిస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పుష్పశ్రీవాణి చురుకుగా పాలుపంచుకుంటున్నారు.

కాగా పుష్పశ్రీవాణికి తన కుటుంబంలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. ఆమె పెదమామ శత్రుచర్ల విజయరామరాజు టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనతో పరీక్షిత్ రాజు చెల్లెలు పల్లవి.. పుష్పశ్రీవాణిపై విరుచుకుపడుతున్నారు. పుష్పశ్రీవాణి 500 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించిందని శత్రుచర్ల విజయరామరాజు పల్లవి ఆరోపిస్తున్నారు.

ఈ విమర్శలపై పుష్పశ్రీవాణి కూడా అంతేస్థాయిలో దీటుగా స్పందించారు. తనకు 500 కోట్ల రూపాయలు కాదు కదా 5 కోట్ల రూపాయల ఆస్తులు కూడా లేవని చెబుతున్నారు. 5 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నిరూపించినా రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ విసురుతున్నారు. మరి ఈ సవాల్ పై పుష్పశ్రీవాణి పెద మామ శత్రుచర్ల విజయరామరాజు సొంత ఆడపడుచు పల్లవి ఏమంటారో వేచిచూడాల్సిందే.