జక్కంపూడి ఫ్యామిలీకి జగన్ బంపరాఫర్ ఇచ్చారు

Fri Jul 19 2019 19:16:08 GMT+0530 (IST)

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తుడిగా నిలిచిన దివంగత నేత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ ఫ్యామిలీని వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కున చేర్చుకున్నారు. వైఎస్ మరణానంతరం అనారోగ్యంతో మంచపట్టి మృతి చెందిన రామ్మోహన్ ఫ్యామిలీకి జగన్ ఆది నుంచి అండగానే నిలుస్తూ వస్తున్నారు. తాజాగా జక్కంపూడి తనయుడు జక్కంపూడి రాజాకు కీలకమైన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెడుతూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ సర్కారు కాసేపటి క్రితం రాజా నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి ఫ్యామిలీకి జగన్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. రామ్మోహన్ చనిపోయిన తర్వాత వైసీపీలో ఆ ఫ్యామిలీకి ఆ జిల్లా పార్టీ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించారు. జక్కంపూడి సతీమణి విజయలక్ష్మీకి ఓ దఫా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. జక్కంపూడి రాజాను ఏకంగా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఇచ్చారు. పార్టీ విపక్షంలో ఉన్నా కూడా జక్కంపూడి ఫ్యామిలీపై ఈగ కూడా వాలకుండా జగన్ చర్యలు చేపట్టారు. ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో జక్కంపూడి రాజాకు రాజానగరం టికెట్ ఇచ్చిన జగన్.... ఆయనను గెలిపించుకున్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన జక్కంపూడి రాజా సత్తా కలిగిన నేతగా ఎదుగుతున్న క్రమంలో ఆయనకు కాపు కార్పొరేషన్ చైర్మన్ వంటి కీలక పదవిని ఇవ్వడం ద్వారా... తన తండ్రికి చేదోడువాదోడుగా నిలిచిన జక్కంపూడి ఫ్యామిలీకి తాను ఇకపైనా అండగా నిలవడం ఖాయమేనన్న సంకేతాలను జగన్ పంపినట్టైందన్న వాదన వినిపిస్తోంది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజా... ఇప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా తనదైన శైలిలో రాణిస్తే... భవిష్యత్తులో మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.