Begin typing your search above and press return to search.

రాజకీయ చంటిబాబు : నేను చేయన్రా... చేయను అంతే....?

By:  Tupaki Desk   |   25 May 2022 2:46 PM GMT
రాజకీయ  చంటిబాబు : నేను చేయన్రా... చేయను అంతే....?
X
అవును ఆయన రాజకీయ చంటిబాబే. లేకపోతే జనాల దగ్గరకు వెళ్ళి అలా మారాం చేయడమేంటి. మరీ బొత్తిగా అమాయకత్వమా. లేక అలవాటు అయిపోయిన అసహనమా. లేక తమ జనాలే అని మితిమీరిన ఆత్మవిశ్వాసమా. ఏదైతే అయింది కానీ మన చంటిబాబు మాత్రం రాజకీయంగా తాను అంతే అనిపించేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ ని ఫేస్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ కధ ఏంటి అంటే గోదావరి జిల్లాల చంటిబాబు మూడేళ్ల క్రితం జగ్గంపేట ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆయన మళ్ళీ జనాల వద్దకు వస్తోంది గడప గడపకూ కార్యక్రమం ద్వారానేనా అంటే అవుననే అంటున్నారు నియోజకవర్గ జనాలు. పోనీ వచ్చినాయన మంచి చెడూ చూసుకుని, తెలుసుకుని నేనున్నాను, విన్నాను అని రాముడు మంచి బాలుడు టైప్ లో అందరినీ పలకరించేసి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. కానీ ఆయన చంటిబాబు కదా. అందుకే మారాం చేసారు.

జనాలు సమస్యలు చెబుతూంటే నేను చేయన్రా అంటూ నోరు జారేశారు. తమ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు సమస్యలు చెబుతూ నిలదీయడంతో చంటిబాబుకు మంట రేగి ఉంటుందేమో. ఇక డ్రైనేజ్ ఎపుడు బాగు చేయిస్తారు అని ఒక వ్యక్తి ఏకంగా స్టైట్ క్వశ్చన్ ఒకటి ఎమ్మెల్యేకు వేశారు. నేను అంతే చేయనంతే అని మనసులో మాటను నోట్లో పలికించారు. నేను చేయను, చేయనంటే చేయను ఎళ్ళు అంటూ ఆయన అనేసరికి జనాలు ఊరుకుంటారా వారూ మండిపోయారు.

అయినా కూడా తనదైన శైలిలో తాపీగా మంచినీటి సదుపాయం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తన‌నైన ఉపన్యాసాన్ని స్టార్ట్ చేసేసరికి జనాలకు చిర్రెత్తిపోయింది. అంతే చాలు గానీ ఇక వెళ్ళు అంటూ చంటిబాబుకి రివర్స్ అటాక్ ఇచ్చేశారు. అక్కడే ఉన్న రైతులైతే ఏం చేత్తారండి. ఇక చాలు ఎల్లిపోండి అంటూ తమ అగ్రాహాన్ని చూపించడంతో చంటిబాబు చిత్తగించాల్సి వచ్చింది అంటున్నారు. మొత్తానికి ఈ రాజకీయ చంటిబాబుకు జనాలు ఇపుడు చుక్కలు చూపించారు. మరి రేపటి రాజకీయ లెక్కలు ఏంటో అన్న కంగారు మాత్రం అనుచరులకు పట్టుకుందని అంటున్నారు.