పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ ఓవర్ రియాక్షన్ ఎందుకు?

Fri Jan 17 2020 12:40:38 GMT+0530 (IST)

YSRCP Leaders Reacts on About Pawan kalyan Alliance with BJP

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తన రాజకీయ జీవితానికి తనే పెద్ద ఒక పెద్ద శత్రువు. తనలోని అస్థిరత గందరగోళాన్ని అంతా పవన్ కల్యాణ్ బహిరంగంగా ప్రదర్శిస్తూ ఉంటారు. లేకపోతే.. గత ఏడాది ఈ సమయంలో కమ్యూనిస్టు పార్టీల  వాళ్లతో తెగతిరిగి - వారితో ఎన్నికల్లో పోటీ చేసి బీఎస్పీ అధినేత్రి మాయవతి కాళ్ల మీద పడిన వ్యక్తి.. ఇప్పుడు మోడీనే దేశానికి దిక్కు అమిత్ షానే దేశానికి కరెక్టు - బీజేపీ అవసరం ఏపీకి ఉంది.. అంటూ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు.ఏడాది వ్యవధిలో పవన్ కల్యాణ్ ఎర్ర పార్టీల దగ్గర నుంచి కాషాయ పార్టీ దగ్గరకు వచ్చారు. అంతకుముందు ఏడాది పచ్చ పార్టీతో సఖ్యతగా ఉన్నారు. ఇప్పటికీ ఇదంతా పవన్ కల్యాణ్ చంద్రబాబు అజెండా మేరకే చేస్తున్నాడనే అభిప్రాయాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి.

రాజకీయాల్లోకి వచ్చి పవన్ కల్యాణ్ ఎంత డబ్బు సంపాదించుకున్నాడో ఎవరికీ తెలియదు. అయితే ఇలాంటి అవకాశవాదంతో..  చెప్పే మాటలు ఎక్కువై చేసే చేష్టలు చాలా చిన్నవిగా ఉండటంతో.. వ్యక్తిగతంగా మాత్రం పలుచన అయ్యాడు. రాజకీయాల్లోకి వచ్చాకా పవన్ కల్యాణ్ ఒక నేతగా ఎదగడం మాట అటుంచితే.. తన వ్యక్తిత్వం విషయంలో విమర్శలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. చాలా మంది పార్టీలు మారి ఉంటారు విలీనాలు చేసి ఉంటారు. అలా అంటే చంద్రబాబు నాయుడు బోలెడు సార్లు యూటర్న్ లు తీసుకున్నాడు. అయితే చంద్రబాబు సిద్ధాంతాలు అంటూ మాట్లాడడు. పక్కా రాజకీయ నేతలా అప్పటికప్పుడు పబ్బం గడుపుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తాడు.

పవన్ కల్యాణ్ మాత్రం చేగువేరా సిద్ధాంతాలను మాట్లాడి ఇప్పుడు బీజేపీ పంచన చేరాడు. రేపటి నుంచి పవన్ సావర్కర్ సిద్ధంతాలను మాట్లాడనూవచ్చు! అయితే పవన్ ఇంతే స్థిరంగా ఎంతకాలం ఉంటాడో ఎవరూ చెప్పలేరు. ఇదీ ఏతావాతా పవన్ కల్యాణ్ రాజకీయ పరిస్థితి.

బాగా పలుచన అయ్యాడు.. ఇక ముందు పవన్ ఏం మాట్లాడినా.. మరింత పలుచన అవుతాడని స్పష్టం అవుతుంది. ఇలాంటి నేఫథ్యంలో పవన్ విపరీతంగా ద్వేషించే వైసీపీ స్పందిస్తూ ఉంది. పవన్ అవకాశవాదాన్ని ప్రస్తావిస్తూ  ఉంది. ఆ పార్టీకి చెందిన అంబటి రాంబాబు రామచంద్రయ్యతో పాటు గుడివాడ అమర్ నాథ్ - శంకర్ నారాయణ తదితరులు కూడా పవన్ విషయంలో స్పందించారు. ఇలా అతిగా స్పందించడం ఎందుకో వైసీపీకే తెలియాలి. పవన్ మానాన పవన్ ను వదిలిస్తే.. అతడే తన రాజకీయానికి శుభం కార్డు వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ వాళ్లు అతిగా స్పందించి.. పవన్ కు అవసరమైన దాని కన్నా చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా అవుతోంది. ఇలాంటి సూక్ష్మాలను వైసీపీ వాళ్లు ఎప్పటికి గ్రహిస్తారో!