వామ్మో వేగలేను అంటున్న జగన్ బంధువు...మ్యాటర్ సీరియస్సే...

Sun Sep 25 2022 18:28:40 GMT+0530 (India Standard Time)

YSRCP Leaders In Andhrapradesh

ఆయన జగన్ కి చుట్టం రాజకీయంగా కూడా ఢక్కామెక్కీలు తిన్న నాయకుడు. అలాంటి ఆయన కూడా తనకు అప్పచెప్పిన బాధ్యతలను చూసి మోయలేను అనేస్తున్నారు. ఇంతకీ ఆయనకు ఎందుకింత ఇబ్బంది కలిగింది విషయం ఏంటి అంటే ఉమ్మడి విశాఖ జిల్లాను చూస్తే బాధ్యతలను ఆయనకు ఇటీవలనే  జగన్ అప్పగించారు.ఇక చూస్తే ఉమ్మడి విశాఖ మొత్తానికి మొత్తం లోకల్ బాడీ ఎన్నికల్లో స్వీప్ చేసింది. ఇక విశాఖ సిటీలో నాలుగు సీట్లు తప్ప అన్ని ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లూ కూడా గెలుచుకుంది. ఎమ్మెల్సీలు ఉన్నారు. పార్టీకి పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా వారే  ఉన్నారు.

దండీగా నాయకులు ఉన్నా వారి మధ్య ఐక్యత లేదు అన్నదే వైసీపీకి బిగ్ ట్రబుల్ గా ఉందిట. దీంతో ఇంతటి కీలకమైన విశాఖ జిల్లాలో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా అంతా ఉంటోందిట. దాంతో పాటు విశాఖ జిల్లాలో ఈ మధ్య పార్టీ పరిస్థితి ఏమంతా బాగా లేదు అని అంటున్నారు. గ్రాఫ్ అయితే బాగా తగ్గిందనే అంటున్నారు.

నాయకులు పెద్దగా పట్టనట్లుగా ఉన్నారని తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఉత్తరాంధ్రా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక వచ్చి పడింది. దానికి ముందుగానే అభ్యర్ధిని ఎంపిక చేసింది వైసీపీ అధినాయకత్వం  ఆయన్ని గెలిపించమంటూ జగన్ ఆ పెద్దాయన మీద కీలకమైన బాధ్యతలు మోపారట. దాంతో ఆయన ఆయాసపడి ప్రయాసపడి విశాఖలోనే మకాం పెట్టి నాయకులు అందరికీ క్షేత్ర స్థాయిలో కలుస్తూ వస్తున్నారు.

అయితే ఈ నాయకులు అంతా తమకు పార్టీ ఏం చేసిందని ఆవేదనతో ఫిర్యాదులు చేస్తున్నారుట. తాము ఇప్పటికే చాలా ఖర్చు చేశామని ఇపుడు మళ్ళీ తమకు గెలుపు బాధ్యతలు అప్పగించడమేంటి అని కొందరు అంటున్నారుట. ఇక టీడీపీకి కంచుకోటలైన ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపీ పాగా వేసినా దాన్ని కాపాడుకోవడంలో నాయకులు విఫలం అవుతున్నారన్న దాన్ని కూడా ఆ పెద్దాయన గుర్తించారుట.

పైగా ఏ నాయకుడిని కదిపినా ఫిర్యాదులు చేస్తున్నారు. తనకు ఏమీ న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి వారిని పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించడం అంటే అయ్యే పనేనా అన్నది ఆయన ఆలోచనగా ఉందిట. అందుకే ఆయన వేగలేకపోతున్నాను అని అంటున్నాట్లుగా తెలుస్తోంది. తనకు అప్పగించిన బాధ్యతల నుంచి తప్పించాలని లేకపోతే తన వద్దకు వచ్చి నాయకులు మొరపెట్టుకున్న డిమాండ్లు అయినా తీర్చాలని ఆయన అధినాయకత్వాన్ని కోరుతున్నారుట.

మరి ఈ రెండింటిలో ఏది చేయకపోయినా ఆ నాయకుడు తన బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.  మరి దీని మీద వైసీపీ హై కమాండ్ ఏమని ఆలోచిస్తుందో తెలియదు కానీ వైసీపీకి ప్రత్యేకించి అధినాయకత్వానికి ఇష్టమైన విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో అర్జంటుగా వైసీపీకి చక్కదిద్దాల్సి ఉందన్నదే ఆ నాయకుడు ఇచ్చిన నివేదిక అని అంటున్నారు.