Begin typing your search above and press return to search.

ఈఓడీబీలు కాదు..ప్ర‌జ‌ల నుంచి ర్యాంకులు తెచ్చుకో బాబు

By:  Tupaki Desk   |   11 July 2018 1:36 PM GMT
ఈఓడీబీలు కాదు..ప్ర‌జ‌ల నుంచి ర్యాంకులు తెచ్చుకో బాబు
X
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ లో మొదటి ర్యాంకు వచ్చిందని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటని - ఏపీని అవినీతిలో నిలిపారని వైఎస్ ఆర్‌ సీపీ నేత‌లు వ్యాఖ్యానించారు. ఎవరో ఇచ్చిన ర్యాంకులు కాదని - ప్రజల నుంచి ర్యాంకులు తెచ్చుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా - ఆదిమూలపు సురేష్‌ - వైఎస్ ఆర్‌ సీపీ నాయకులు పేర్ని నాని మీడియాతో వేర్వేరుగా మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరుపై మండిప‌డ్డారు. హైదరాబాద్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో కేంద్రం చేసిన ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గొప్పలు చెప్పుకునేందుకు రెడీ అయ్యిందని మండిపడ్డారు. ఈ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వల్ల ఆకాశం ఏమైనా బద్ధలవుతుందా అని ప్రశ్నించారుగతంలో కూడా ఎన్నో ర్యాంకులు వచ్చాయని - ఏమైనా సాధించారా అని నిలదీశారు. పరిశ్రమలకు ఈ ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు కల్పిస్తున్నారన్నారు. అవినీతిలో టాప్ ఉంద‌ని అనేక సంద‌ర్భాల్లో రుజువు అయింద‌ని సురేష్ తెలిపారు. సెంట్రల్‌ ఫర్‌ మీడియా సర్వీస్‌ అనే రిపోర్టు ఉందని - ట్రాన్స్‌ ఫరెన్సీ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక విధానం రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 3 లక్షల ఎకరాల భూ సేకరణ జరిగిందని - ఇంకా 7 లక్షల ఎకరాల సేకరణ అవసరమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ లో నిర్మాణ పరిపాలన తదితర అంశాలపై సరళీకృత వ్యాపార విధానంలో ర్యాంకింగ్‌ లు ఇచ్చారన్నారు.

ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విష‌యంలో చంద్ర‌బాబు అవినీతి మ‌రోమారు స్ప‌ష్ట‌మైంద‌ని వ్యాఖ్యానించారు. పనులు పరిశీలించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వణికిపోయారని ఆమె పేర్కొన్నారు. అందుకే కేబినెట్ స‌మావేశం పెట్టి హ‌డావుడి చేశార‌న్నారు. గ‌డ్కరీతో భేటీకి వెళ్ల‌వ‌ద్ద‌ని మంత్రులు సూచించిన‌ప్ప‌టికీ...అక్క‌డికి వెళ్లి గ‌డ్కరీ గ‌రం కాకుండా చూసుకున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇదంతా బాబుకు పుట్టిన అవినీతి భ‌య‌మ‌ని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉన్నప్పటికీ టెండర్లను తమకు అప్పగిస్తే ప్రత్యేక హోదా - వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీలు అవసరం లేదంటూ ఏపీ భవిష్యత్తును చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు.

చంద్రబాబు అందరినీ మోసం చేశారని - చదువులు చెప్పే గురువులను సైతం మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అని వైఎస్ ఆర్‌ సీపీ నాయకులు పేర్ని నాని విమర్శించారు. టీచర్లను పోలీసు స్టేషన్లలో బంధించిన దుర్మార్గ ప్రభుత్వమిదని మండిపడ్డారు. మహిళా టీచర్ల ఇళ్లకు వెళ్లి పోలీసులు బెదిరించడం - ధర్నాలో పాల్గొనకుండా టీచర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్ ఆర్‌ సీపీ ఖండిస్తుందన్నారు. ఇన్నాళ్లు రైతులను - మహిళలను - నిరుద్యోగులనే చంద్రబాబు మోసం చేశారని విమర్శించే వారని, చివరకు చదువులు చెప్పే గురువులను కూడా వదల్లేదని ఆయన మండిపడ్డారు. చదువు చెప్పిన గురువుకు అబద్ధం చెప్పకూడదని బడిలో పాఠాలు చెబుతారన్నారు. చంద్రబాబు ఎక్కడ చదువుకున్నారో తెలియదని - ఆయనకు టీచర్లను గౌరవించాలన్న జ్ఞానం లేకుండా పోయిందన్నారు.