పదవి కోసం మోడీ ముందు మోకరిల్లిన బాబు : ఐవీరెడ్డి

Sat Jan 13 2018 23:15:43 GMT+0530 (IST)

YSRCP Leader IV Reddy Comments on Chandrababu Naidu

రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి...రాజకీయాలే పరమావధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలుగుదేశం పార్టీ రథసారథి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిద్దలూరు నియోజకవర్గం ఇంచార్జీ ఐవీరెడ్డి మండిపడ్డారు. తన పదవి కాపాడుకునేందుకు రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమనేది తేలిపోవడంతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తూ చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. తనపై ఉన్న క్రిమినల్ కేసులకు భయపడే ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాల కంటే...రాజకీయంగా తనకు మేలు చేసే వాటికే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని ఐవీరెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ప్రత్యేకంగా విన్నవించడం ఇందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. `అసెంబ్లీ సీట్ల పెంపు కంటే..ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి సీఎం చంద్రబాబు విన్నవించాల్సింది. కానీ ఆ పని చేయకపోవడం దురదృష్టకరం. గడిచిన మూడున్నరేళ్ల పాలనలో... రాష్ర్టానికి ఆయన చేసింది శూన్యం` అని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నాటి హామీలను నెరవేర్చాలని ఇప్పటికీ  ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించడం చూస్తుంటే..మూడున్నరేళ్లలో ఆయన సాధించింది ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఐవీ రెడ్డి వెల్లడించారు.

రాబోయే ఎన్నికల్లో గెలుపుపై అపనమ్మకం నెలకొనడం వల్లే...సీఎం చంద్రబాబు ప్రధానితో భేటీ అయ్యారని ఐవీరెడ్డి ఆక్షేపించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగితే గెలవలేనని భావించే...బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. తనపై నమోదైన ఓటుకు నోటు కేసు నుంచి కాపాడాలని ప్రధానిని బాబు అభ్యర్థించారు. ఇలాంటి వ్యక్తికి సీఎం సీటుపై కూర్చునేందుకు ఒక్క రోజు కూడా అర్హత లేదని ఐవీరెడ్డి స్పష్టం చేశారు.