Begin typing your search above and press return to search.

సొంత బీసీలు చేదా : వారికి పదవి రాదా...?

By:  Tupaki Desk   |   17 May 2022 2:30 PM GMT
సొంత బీసీలు చేదా : వారికి పదవి రాదా...?
X
వైసీపీ బీసీల పార్టీగా గట్టి ముద్ర వేసుకోవాలని చూస్తోంది. ఈ బ్రాండ్ ఇమేజ్ 2019 దాకా కేవలం టీడీపీకి మాత్రమే ఉండేది. ఉమ్మడి ఏపీలో టీడీపీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ని ఢీ కొట్టడానికి అవసరం అయిన రాజకీయ బలం అంతా బీసీలే అందించారు. బీసీ ఓటు బ్యాంక్ పెద్ద ఎత్తున ఎపుడూ టీడీపీ వైపే మొగ్గేది.

ఇక 2019 నాటికి రాజకీయం మారింది. బీసీ ఓట్లకు వైసీపీ కూడా గురి పెట్టింది. అదే టైమ్ లో కాపులకు బీసీ రిజర్వేషన్ల విషయంలో టీడీపీ తడబాటు పడడంతో అది పొరపాటుగా మారి ఆ పార్టీ రాజకీయాన్ని టోటల్ గా మార్చేసింది. ఇది ఒక కీలకమైన అంశంగా 2019 ఎన్నికల్లో చూడాలి.

అయితే బీసీలు అంతా తమ వైపే ఉన్నారు అని ధీమా పెంచుకున్న వైసీపీ వారి ఓటు బ్యాంక్ ని సాలిడ్ గా తమ వైపునే ఉంచేసుకోవాలని చూస్తోంది. మూడేళ్ళుగా వైసీపీ బీసీలకు పదవులు కట్టబెడుతూ వచ్చింది. ఇక మరో వైపు బీసీల కార్పోరేషన్లను కూడా ఏర్పాటు చేసింది.

ఈ సంగతి ఇలా ఉన్నా రాజ్యసభలో బీసీలకు చోటు కల్పించడంలో వైసీపీ తన మార్క్ ని చాటుకుంది. కానీ తాజాగా రాజ్యసభ సీట్లకు ఇద్దరు బీసీలను ఎంపిక చేయడం పట్ల పార్టీలో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్యకు ఇవ్వడం, రెండవది టీడీపీలో రాజకీయ జీవితం మొత్తం పండించుకున్న బీద మస్తాన్ రావుకు ఇవ్వడం పట్ల చర్చ సాగుతోంది.

వైసీపీలో బీసీ నేతలు లేరా అన్న మాట కూడా వినిపిస్తోంది. రాష్ట్రం కాని వారికి ఎంపీ సీటు ఇవ్వడమేంటి అన్న విమర్శలు వస్తున్నాయి. ఇక టీడీపీలో ఉంటూ మూడేళ్ల క్రితం వైసీపీలో చేసిన బీద మస్తాన్ రావుకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం అంటే పన్నెండేళ్ళుగా పార్టీ కోసం కష్టపడుతున్న వారిని విస్మరించడమే అని కూడా అంటున్నారు.

బీసీల పార్టీగా వైసీపీ ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ ఆ ఇచ్చే పదవులు పార్టీలో ఉన్న సీనియర్ బీసీ నేతలకు ఇస్తే న్యాయంగా ఉండేదని కూడా అంటున్నారు. తెలంగాణాను కార్యక్షేత్రంగా ఎంచుకుని పనిచేస్తున్న క్రిష్ణయ్యకు రాజ్య సభ ఇవ్వడం వల్ల ఏపీలోని బీసీలు ఎలా టర్న్ అవుతారు అన్నది ఒక మాట.

అలాగే తెలుగుదేశం పెంచి పెద్ద నాయకుడిగా చేసిన బీద మస్తాన్ రావుకు ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల వైసీపీ కొత్తగా సాధించిన సామాజిక న్యాయం ఏంటి అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా వైసీపీలో బీసీ నేతలకు అసంతృప్తికి గురి చేసేలా ఈ నిర్ణయాలు ఉన్నాయని అంటున్నారు. అరువు తెచ్చుకున్న నేతలతో వైసీపీ బీసీ నినాదం ఎలా సాకారం అవుతుంది అన్న మాట ఉంది. చూడాలి మరి ఈ ఎత్తుగడ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో.