జూపూడి గ్రీన్ సిగ్నల్.. వైస్సార్సీపీ పెద్ద పొరపాటు!

Wed Oct 09 2019 13:51:33 GMT+0530 (IST)

YSRCP Cadre Disappointed with Jupudi Prabhakar Rao Joins in YSRCP

జూపూడి ప్రభాకర్ రావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకోవడం బిగ్గెస్ట్ బ్లండర్ అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి పొరపాటే చేశాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఈ విషయంలో అసంతృప్తితో - అసహనంతో ఉన్నారని స్పష్టం అవుతోంది.సోషల్ మీడియాలో అందుకు సంబంధించి ట్రోలింగ్ కొనసాగుతూ ఉంది. జూపూడి ఏమీ ప్రజా నేత కాదు - లాబీయింగ్ తో భజనలతో మనుగడ సాగించే వ్యక్తి. అంత మేధావి కాదు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా పార్టీ పరువు తీశాడు కానీ - అంతకు మించి చేసి పెట్టిందీ ఏమీ కాదు. అద్భుతమైన వ్యక్త కూడా కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులూ అడ్డగోలుగా మాట్లాడాడు.

అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎందుకు చేర్చుకున్నారు - ఆయన అవసరం పార్టీకి ఏమొచ్చింది? అనే ప్రశ్న వ్యక్తం అవుతోంది. గత ఎన్నికలు పూర్తి అయిన రెండు మూడు నెలల్లోనే పార్టీ ఫిరాయించాడు జూపూడి. ఇప్పుడు మళ్లీ మూడు నెలలు అవుతున్నట్టుగానే ఇవతలకు వచ్చాడు. ఐదేళ్ల పాటు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున తెగ ఓవరాక్షన్ చేశాడు.

చంద్రబాబు భజన చేసి పదవిని పొందాడు. ఇప్పుడు  ఆ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి ఇటు వైపుకు వచ్చాడు. ఇలాంటి వారికి జగన్ ఎందుకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టో - అసలు అతడి అవసరం ఏమిటి? అనేది సోషల్ మీడియా వ్యక్తం అవుతున్న ప్రశ్న.

జూపూడిని చేర్చుకుని జగన్ తన పార్టీ కార్యకర్తల్లోకి - ద్వితీయ శ్రేణి నేతల్లోకి తప్పుడు సంకేతాలు పంపించినట్టుగా అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. జూపూడికి ఎలాంటి పదవిని ఇవ్వలేదు. చేర్చుకున్నారంతే. అయినా  వైసీపీ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే జరిగిపోయింది. ఇప్పుడు ఆయనను వదిలించుకోలేరు. కార్యకర్తల్లో మాత్రం అసహనం వ్యక్తం అవుతోంది.